భూములు లాక్కోవద్దు.. నేనొచ్చింది గొడవకి కాదు.. పవన్ కళ్యాణ్


 


భూసేకరణ వద్దని.. వారి రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదిక ద్వారా చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. కానీ ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పక్కన పెట్టి ఐదు గ్రామాల పరిధిలో భూముల సేకరణకు రైతులకు నోటిఫికేషన్ లు జారీ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తన సినిమా షూటింగ్ ను మధ్యలోనే ఆపేసి వచ్చి మరీ ఆదివారం రాజధాని ప్రాంతమైన ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పర్యటించారు. ఏడాదికి మూడు పంటలు పండే రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని ఒకవేళ రైతులు తమ ఇష్ట ప్రకారం భూములు ఇస్తానంటే తీసుకోండి.. అంతేకాని ఇవ్వని వారి దగ్గర నుండి బలవంతంగా భూములు లాక్కోవద్దు..! లాక్కోవద్దు..!! లాక్కోవద్దు!!! అంటూ తేల్చి చెప్పారు. ఒకవేళ అలా చేస్తే రైతుల తరుపున తాను పోరాడతానని.. వారి కోసం ధర్నా చేస్తానని, నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.


అంతేకాదు నేను ఇక్కడికి వచ్చింది టీడీపీతోనో ముఖ్యమంత్రితోనో గొడవ పెట్టుకోవడానికి కాదని.. రైతుల సమస్యలను తెలియజేయడానికి వచ్చానని.. దయచేసి భూసేకరణ నోటిఫికేషన్లు ఆపండని.. బలవంతపు భూ సేకరణ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.