బాబు వస్తేనే బాగు
posted on Jun 8, 2023 10:23AM
ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం రెండుగా విడిపోయి తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. సంబురాలు చేసుకుంటోంది. మరి అవశేషఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఏమిటి? ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఉన్న సెక్రటేరియట్ ను కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టుకుంది. అవశేషా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సెక్రటేరియట్ నిర్మించుకోవడం కాదు.. అసలు రాజధానే లేని రాష్ట్రంగా మిగిలిపోయింది.
అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం, ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన రాజదాని అమరావతి నిర్మాణాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులనే ఆలోచన పేరుతో అసలుకే ఎసరు పెట్టారు. జగన్ రెడ్డి దుర్మార్గ ఆలోచన కారణంగా రాజధాని కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు ఆందోళన బాటపట్టారు. కోర్టులు, కేసులతో నాలుగేళ్ళు గడిచిపోయాయి. సెక్రటేరియట్ కాదు, అసలు రాజధానే లేని రాష్ట్రంగా అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నవ్వుల పాలైంది.
మరోవంక, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగణ రాష్ట్రం ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. అందులో ఏమి మతలబుంది, ఎంత అవినీతి జరిగింది అనేది పక్కన పెడితే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంది. పంటలు పెంచుకుంది.
వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. మరోవంక అవశేష ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పేర్కొన్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ళలో 75 శాతానికిపైగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం గడచిన నాలుగేళ్ళలో మరో అడుగు ముందుకేయలేదు. చాప చుట్టేసింది. జీవనాడి ఊపిరి తీసేసింది. ఇక పెట్టుబడులు, ఇతరత్రా అభివృద్ధికి సంబంధించి, రెండు రాష్త్రాల మధ్య ఎంత తక్కువ పోలిక తెస్తే, ఏపీ ఆబోరు ఆమేరకు మిగులుతుంది.
ఇలా తొమ్మిదేళ్లలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అన్ని విషయాల్లోనూ వెనకబడిన రాష్ట్రంగా మిగిలింది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో నాటిన ఐటీ విత్తనాలు ఇప్పుడు మహా వృక్షాలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రంఐటీ రంగంలో దూసుకు పోతోంది. అనేక దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో తమ సంస్థలు తెరిచాయి. ఫలితంగా, తెలంగాణ రాష్త్రం ఐటీ రంగంలో దినదినాభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) తాజా నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ రంగంలో 31.44 శాతం అభివృద్ధి సాధించింది.
తెలంగాణలో ఐటీఎగుమతులు రూ3904.55 కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం(జూన్ 7) సగర్వంగా ప్రకటించారు. మరి ఏపీలో ఐటీ రంగం పరిస్థితి ఏమిటి? మళ్ళీ ఇక్కడ అదే కథ. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశేషంగా కృషి చేశారు. ఆయన కృషి ఫలించి మొగ్గ తొడిగే సమయానికి ప్రభుత్వం మారి పోయింది. రాష్ట్రం ఐటీ అంటే మీటలు నొక్కడమే అనుకునే పాలకుల పాలైంది. అందుకే ఏపీలో ఐటీ శాఖ ఒకటుందని, ఆ శాఖకు ఒక మంత్రి ఉన్నారని ఆయన పేరు గుడివాడ అమరనాద్ అని చాలా మందికి తెలియదు. అమర్నాథ్ మాటకు ముందొకసారి. వెనకోకసారి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్తోత్రం చదువుతారు. అన్ని విషయాలు మాట్లాడతారు, కాన , ఐటీ .. అంటే మాత్రం ఆ ఒక్కటీ అడగవద్దని తప్పుకుంటారు.
నిజమే కావచ్చును.. రాష్ట్ర విభజన సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేసింది. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా అదే అన్యాయాన్ని కొనసాగిస్తోంది. మరో వంక 2019 లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో అప్పుడే మొదలైన ప్రగతి ప్రస్థానాన్ని దారి మళ్ళించారు. అనుభవ రాహిత్యం, అజ్ఞానం, అహంకారం కలబోసి అభివృద్ధిని అటకెక్కించారు. ఈరోజు ఏపీ అంటే అప్పులు. ఏపీ అంటే తిప్పలు అనుకునే దయనీయ స్థితికి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అందుకే రాజకీయ విశ్లేషకులు, మేథావులు రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుదు శ్రీకారం చుట్టిన ఏపీ పునర్నిర్మాణ మహా యజ్ఞం కొనసాగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన తెచ్చుకోవడం ఒక్కటే పరిష్కారం అంటున్నారు.