మంత్రి గారికే ఝలక్ ఇచ్చిన దొంగలు..

 

దొంగలు ఓ మంత్రిగారికే ఏకంగా ఝలక్ ఇచ్చి హ్యాండ్‌బ్యాగ్‌ను ఎత్తికెళ్లారు. ఇంతకీ ఎవరా మంత్రి.. ఈ ఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? ఈ ఘటన ఒడిశాలో జరిగింది.  వివరాల్లోకెళితే.. ఒడిశా స్కిల్ డెవలప్‌మెంట్‌ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రి ఉషాదేవి పూరి-దుర్గ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో భువనేశ్వర్ నుంచి కంటబంఝికి వెళ్తున్నారు. ఈ ప్రయాణంలో ఆమె బ్యాగును దొంగలు దొంగిలించారు. అయితే కొద్ది దూరం వెళ్లిన తరువాత కానీ ఆమె విషయం గమనించలేదు. దీంతో తితాల్‌గఢ్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన హ్యాండ్‌లో ఐడీకార్డు, మొబైల్ ఫోన్, 25వేల నగదు, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని, రైరఖోల్-అంగుల్ స్టేషన్ల మధ్య తన హ్యాండ్‌బ్యాగ్ దోపిడీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న రైల్వే పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. కాగా, రాష్ట్ర మంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.