జగనన్న ఇదేం మద్దతన్నా.. ధాన్యం కొనుగోళ్లపై రైతుల వెతలు
posted on Apr 22, 2022 10:22AM
ఏపీలో జగన్ సర్కార్ మాటలకూ చేతలకూ పొంతన ఉండటం లేదు. రైతు పక్షపాతినని చెప్పుకుంటున్న జగన్ ఆచరణలో మాత్రం వారిపై శీత కన్నేశారు. మద్దతు ధర ఇచ్చి మరీ దాన్యం కొనుగోలు చేస్తానని ఆయన ఇచ్చిన హామీ ‘ఫ్యాన్’ గాలికి కొట్టుకుపోయింది. తెగుళ్లు, అధిక వర్షాలు, దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. అసలే దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న రైతుకు ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పడంతో మరోవైపు మద్దతు ధర లభించే పరిస్థితి కానరావడం లేదు. వర్షం.. తెగుళ్లు.. ధాన్యం రైతును దారుణంగా దెబ్బతీశాయి. ఆరుగాలం కష్టించి సాగు చేసినా ఆశించిన దిగుబడులు రాక అన్నదాత అల్లాడుతున్నాడు. సాగు కష్టాలను అధిగమించి పండించిన ధాన్యానికి మార్కెట్‌లో మద్దతు గిట్టుబాటు ధర లేక మరింత కుదేలౌతున్నాడు. ప్రభుత్వం పేరుకే మద్దతు ధర ప్రకటించింది. కానీ కొనుగోలు విషయంలో మాత్రం చేతులెత్తేసింది.ఆర్‌బీకేల్లో నిబంధనలు పరిశీలిస్తే ధాన్యం విక్రయించుకునే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. యంత్రాలతో నూర్పిళ్లు చేస్తున్నందున తేమ ఉంటుందన్నారు. అయితే 17 శాతం లోపే తేమ ఉండాలని మార్కెటంగ్ శాఖ షరతులు విధిస్తున్నది. దీనికి తోడు ట్రాన్స్‌ఫోర్టు ఖర్చులు, కాటా కూలి కలిపితే బస్తాకు వందకుపైగా ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ఆర్‌బీకేలలో షరతులు సడలించాలని, తేమను పరిగణనలోకి తీసుకోకుండా కోనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కూడా మద్దతు ధర అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని చెప్పిన జగన్ సర్కార్ ఇప్పుడు వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మార్కెట్‌లో ధాన్యం ధర నానాటికీ తీసికట్టు అన్నట్లుగా పతనమౌతోంది. మరో వైపు జగన్ సర్కార్ రైతుల కష్టాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నది. దిగుబడులు తగ్గి, ధర పనతమై రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. ఆర్‌బీకేల ద్వారా రైతుల నుంచి ధాన్యం కోనుగోలు చేస్తామని ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేసి చేతులుదులిపేసుకుంది. క్షేత్రస్థాయిలో కొనుగోలుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు పైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీనిని అలుసుగా తీసుకుని వ్యాపారులు ధరను అమాంతం తగ్గించేసి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఒక్క సాగర్ ఆయకట్టులోనే రెండున్నర లక్షలకు పైగా ఎకరాలలో వరి సాగు జరిగింది. ఎకరాకు 25 బస్తాలలోపే దిగుబడులు ఉంటున్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆర్కేబీలలో ధాన్యం కొనుగోళ్ల నిబంధనలు సడలించి మద్దతు ధరకుప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలన్న రైతుల డిమాండ్ ను సర్కార్ పెడచెవిన పెడుతోంది. ప్రకటనలకే రైతు భరోసా కానీ వాస్తవంలో జరుగుతున్నది రైతును దోపిడీ చేయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.