ఒప్పిస్తే పోల'వరం' అంటున్న గడ్కరీ

'మింగమంటే కప్పకు కోపం.. వదలమంటే పాముకు కోపం' అన్నట్టు 'పోలవరం విషయంలో బాబుని శభాష్ అంటే బీజేపీకి కోపం.. పోలవరంకు సహకారం అందించలేమంటే ప్రజలకు కోపం'.. ఇలాంటి సమయంలో పోలవరంను సందర్శించిన నితిన్‌ గడ్కరీ.. కర్ర విరక్కూడదు పాము చావకూడదు అన్నట్టుగా చాలా తెలివిగా స్పందించారు.. పోలవరం ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది కాదు.. ఇది మొత్తం భారతదేశానిది.. ప్రధాని మోదీ సారథ్యంలో దీనిని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం అని స్పష్టం చేసారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సీఎం కష్టపడుతున్నారని.. వారి కృషి వల్లనే పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.. అదే చిత్తశుద్ధి, నిబద్ధత తనకు, కేంద్ర ప్రభుత్వానికీ ఉందన్నారు.. డబ్బులు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరులు ఉంటే సరిపోదు.. బలమైన చిత్తశుద్ధి ఉంటేనే పనులు జరుగుతాయి అని అన్నారు.. పోలవరం అంచనా వ్యయం రూ.60వేల కోట్లకు చేరుకుందని గడ్కరీ తెలిపారు.

 

 

కొత్త చట్టం భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస కల్పన, పరిహారం చెల్లించాల్సి ఉందని అంగీకరించారు.. అయితే సివిల్‌ పనుల్లోనూ అంచనా వ్యయం పెరిగిందని, సేకరించాల్సిన భూమీ గత అంచనాకంటే రెట్టింపు ఉందని తెలిపారు.. పోలవరానికి నిధుల సమస్య లేనే లేదు.. అయితే నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ఆర్థిక శాఖే.. అంచనా వ్యయం ఎందుకు పెంచాల్సి వచ్చిందో సహేతుకంగా వివరించి ఒప్పించాల్సి ఉంది అని తెలిపారు.. డాక్యుమెంట్లు సమర్పించిన ఎనిమిది రోజుల్లోనే దీనిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. రాష్ట్రం నుంచి అధికారులు రండి.. కేంద్రంలోనూ సంబంధిత అధికారులందరిని అందుబాటులో ఉంచుతాను.. మూడు రోజులు పోలవరంపైనే చర్చిద్దాం.. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి వద్దకు ఉమ్మడిగా వెళదాం.. పెరిగిన అంచనాల గురించి ఒప్పించి, అనుమతులు తెచ్చుకుందాం అని గడ్కరీ పేర్కొన్నారు.