బళ్లారి నుండి ఖనిజం కావాలంటూ 'ఎన్ఎండీసీ'పై వైసీపీ సర్కార్ ఒత్తిడి!!

 

కడప స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజం ఎక్కడి నుంచి సరఫరా చేయాలన్న అంశం పై పీటముడి పడింది. ఈ ప్లాంటుకు డిసెంబర్ లో శంకుస్థాపన చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి అవసరమైన ఇనుప ఖనిజం సరఫరా కోసం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకుంది. అందులో పేర్కొన్నట్లు సమీప గనుల నుంచి ఖనిజం సరఫరా చేయాలని ప్రభుత్వం విధించిన నిబంధనకు ఎన్ఎండీసీ అంగీకరించడం లేదని తెలిసింది. ఎన్ఎండీసీకి బళ్లారి ప్రాంతాల్లో, చత్తీస్ గఢ్ లో ఇనుప గనులున్నాయి. బళ్లారి నుంచి కడపకు దగ్గర అనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. ఖచ్చితంగా అక్కడి నుంచే ఇస్తామన్న అంశాన్ని ఒప్పందంలో ఉంచేందుకు ఎన్ఎండీసీ ఒప్పుకోవడం లేదని సమాచారం.

బళ్లారి దగ్గర కావడంతో రవాణా ఖర్చు తగ్గుతుందని అదే చత్తీస్ గఢ్ అయితే పెను భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి కర్ణాటకలో అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాల విచ్చలివిడిగా జరిగినప్పుడు అక్కడ నుంచి ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం విదేశాలకు మాత్రమే ఎగుమతి చెయ్యకూడదని కర్ణాటకలో ఐరన్ ఓర్ ని ఈ వేలం ద్వారా విక్రయిస్తామని ఎన్ఎండీసీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సమీప గనుల నుంచే అన్న నిబంధన లేకుంటే భవిష్యత్తులో ఇబ్బంది అనే అభిప్రాయం వినిపిస్తొంది. అయినా ప్లాంట్ పూర్తయినప్పుడు కదా ఖనిజ సరఫరా చేసేది.. అప్పుడు చూద్దామని ఎన్ఎండీసీ అంటున్నా దాని పై పట్టు పట్టాల్సిందేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చత్తీస్ గఢ్ లో ఎన్ఎండీసీ స్వయంగా స్టీల్ ప్లాంట్ నిర్మిస్తుంది. కావలసినన్ని నిధులున్నా పదేళ్లుగా పనులు నడుస్తూనే ఉన్నాయి. దీని నిర్మాణానికి మరో రెండు మూడేళ్ళు పట్టేలా ఉందంటున్నారు. దాని కోసం రూ. 80 వేల కోట్ల వరకు ఖర్చ అయ్యిందని ఏటా రూ. 8 వేల కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడి పెడుతూనే ఉన్నారని సమాచారం.