అమరావతికి లైన్ క్లియర్
posted on May 28, 2015 10:51AM
.jpg)
తుళ్ళూరు మండలంలో రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి నేటి వరకు కూడా అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ వాటినన్నిటినీ అధిగమించుకొంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయినా ఇంకా దానికి అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి.
సారవంతమయిన పంట భూములలో ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపడుతోందని దాని వలన సామాజిక, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని, అదే విధంగా కృష్ణా నదీ తీరాన్న నిర్మించడం వల్ల రాజధానికి వరదల ప్రమాదం కూడా పొంచి ఉందని, కనుక అక్కడ రాజధాని నిర్మించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి (‘స్టే’) ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన పందలనేని శ్రీమన్నారాయణ జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) లో ఒక పిటిషను వేశారు.
ఆయన వాదనలు విన్న జస్టిస్ యూడీ సాల్వి, జస్టిస్ ఎన్‌ఎస్ నంబియార్, నిపుణులు డాక్టర్ దేవేంద్ర కుమార్ అగర్వాల్, ప్రొఫెసర్ ఏఆర్ యూసుఫ్, బిక్రంసింగ్ సజ్వన్‌తో కూడిన విస్తృత ధర్మాసనం రాజధాని నిర్మాణంపై స్టే ఇచ్చేందుకు తిరస్కరించింది. కానీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఈ పిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ అంశంపై విచారణను జూలై 27కి వాయిదా వేసింది.