"అన్న"గారి గుర్తులు...
posted on May 28, 2016 5:37PM
ఒక్కడు.. ఒకే ఒక్కడు..మేరునగధీరుడు..యుగపురుషుడు..యుగానికి ఒక్కడు. మదరాసీలుగా పిలుస్తున్న తెలుగువారికి ఓ ప్రత్యేక ఆస్తిత్వం ఉందని జగతికి చాటిన మహానీయులు..ఏళ్లకు ఏళ్లు ఏకఛత్రాధిపత్యం కింద పాలిస్తున్న కాంగ్రెస్ కంచుకోటను బద్ధలు కొట్టిన వ్యక్తి..పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం అందిపుచ్చుకున్న శక్తి. ఆయనే తెలుగువారి ఇలవేల్పు నందమూరి తారకరామారావు. సినీనటుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన తెలుగువారిపై వేసిన ముద్ర ఎప్పటికి చెరిగిపోనిది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించినా..పాలిస్తున్నా ఎన్టీఆర్ ఈజ్ ఒన్ అండ్ ఓన్లీ. సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని పేదవారికి దగ్గర చేసినా..రాజకీయాలంటే ఇలా ఉంటాయని తెలియజేసినా అది తారక రాముడికే చెల్లింది. తెలుగునేలపై ఆయన జ్ఞాపకాలు ఎన్నటికి పదిలం. అన్నగారి జయంతి సందర్భంగా ఆ జ్ఙాపకాల్లో మచ్చుకు కొన్ని.
1. రెండు రూపాయలకే కిలో బియ్యం
అన్నగారి పేరు తలచుకోగానే ముందుగా గుర్తొచ్చే పథకం ఏమైనా ఉందా అంటే అది రెండు రూపాయలకే కిలో బియ్యం. దీని ద్వారా ఎంతోమంది నిరుపేదలకు నాలుగువేళ్లూ లోపలికి వెళ్లి ప్రజల దృష్టిలో ఎన్టీఆర్ దేవుడయ్యారు. తద్వారా దేశంలోని చాలా మంది ముఖ్యమంత్రులకు మార్గదర్శకుడయ్యారు.
2. జనతా వస్త్రాలు
చేనేత కార్మికుల కష్టాలను తీర్చడం, పేదలకు సగం ధరకే వస్త్రాలను అందించడానికి ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ పథకాన్నే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పున:ప్రారంభించారు
3. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు
నిజాం నుంచి స్వాతంత్ర్యం పొంది భారతదేశంలో భాగమైనా కాని తెలంగాణ ప్రజలకు పటేల్, పట్వారీల నుంచి ఇబ్బందులు తప్పలేదు. రామారావు అధికారంలోకి వచ్చిన వెంటనే 1985లో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యాన్ని తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.
4. మహిళలకు ఆస్తిలో వాటా
స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం లభించనంత వరకూ వారి జీవితాల్లో ఎలాంటి మార్పు ఉండదని నమ్మి..మహిళలకు ఆస్తిలో సమానవాటా ఇవ్వాలి అని చట్టం తెచ్చి మొత్తం ఆడపడుచులకు అన్నగారయ్యాడు.
5. ట్యాంక్ బండ్
అనేక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన తెలుగు ప్రముఖుల గురించి ముందు తరాల వారికి తెలియజేయాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్యాంక్‌బండ్‌లో వారి విగ్రహాలను ఏర్పాటు చేసి భాగ్యనగరానికి కొత్తకళను తీసుకువచ్చారు.
6. హుస్సేన్‌సాగర్‌లో బుద్ద విగ్రహాం
హైదరాబాద్‌కు సహాజ అందాన్ని తీసుకువచ్చే హుస్సేన్‌సాగర్‌కు మరింత వెలుగులు తీసుకురావడానికి బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ పేరిట కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హుస్సేన్‌సాగర్ మధ్యలో బుద్దుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న గౌతమ బుద్ధుని ఏకశిలా విగ్రహాం ఇదొక్కటే.
7 సంపూర్ణ మద్యపాన నిషేధం
మద్యపానంతో కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమవుతాయో ప్రత్యక్షంగా తెలుసకున్న ఎన్టీఆర్ 1994 ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఐదు నిమిషాల్లోనే మద్యపాన నిషేధం బిల్లుకు సంబంధించిన ఫైలుపై సంతకం పెట్టి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనిని పకడ్బందీగా అమలుపరచడానికి రాష్ట్రం నలుమూలలా చెక్‌పోస్ట్‌లతో మొత్తం ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను అప్రమత్తం చేశారు.
8. తెలుగుగంగ ప్రాజెక్ట్
రాయలసీమ సాగునీటి అవసరాలతో పాటు చెన్నై వాసుల దాహార్తిని తీర్చేందుకు ఎన్టీఆర్ నిర్ణయానికి ప్రతిరూపమే తెలుగుగంగ
9. తెలుగువిశ్వవిద్యాలయ స్థాపన
తెలుగుభాష, సాహిత్య సాంస్కృతిక అభివృద్ధి కోసం ఒక ప్రభుత్వ సంస్థ ఉండాలనే తపనతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఎన్టీఆర్. అంతేకాకుండా బోధన, పరిశోధనల నిమిత్తం రాజమండ్రి, శ్రీశైలంలలో ప్రాంగణాలు నెలకొల్పి, మూడు ప్రాంతాలను సమదృష్టితో వికాసపరచాలనే ముందుచూపు ఎన్టీఆర్‌కే సాధ్యం.
10. ఎంసెట్
మొత్తం విద్యావిధానాన్ని ప్రక్షాళన చేసి. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి గాను ప్రత్యేక ప్రవేశ పరీక్షా విధానానికి నాంది పలికారు. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్)ను ప్రవేశపెట్టింది అన్నగారే. దీనిలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు, తమకు నచ్చిన ఏ కాలేజీలోనైనా చేరే వెసులుబాటును కల్పించారు.
11. నేషనల్ ఫ్రంట్
కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశంలోనే ఎదురు నిలచిన వ్యక్తి ఎన్టీఆర్. ప్రాంతీయ శక్తులన్నింటిని ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే
12 . శాసనమండలి రద్దు
శాసనమండలి వల్ల ఖజానాపై భారం తప్ప ప్రజలకు ఒరిగేదేమి లేదని భావించిన ఎన్టీఆర్. ఒకే ఒక్క కలం పోటుతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
పైన చెప్పినవే కాకుండా తెలంగాణ ఉద్యోగుల కోసం 610 జీవో, మండల వ్యవస్థ, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, జోగిని దురాచార నిర్మూలన, గరిష్ట భూపరిమితి చట్టం, లోకాయుక్త ఏర్పాటు, నేత వృత్తుల వారికీ ఆప్కోద్వారా భద్రత, మత కల్లోలాల అణిచివేత , శాంతి భద్రతల రక్షణ వంటి పలు కార్యక్రమాలతో ఎన్టీఆర్ పాలన రామరాజ్యాన్ని తలపించింది.