రాజీనామా చేయలేదింకా: నల్లపురెడ్డి

 

నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వర్గానికి పార్టీలో మేకపాటి వర్గానికి మధ్య జరుగుతున్న అంతర్యుద్దం ప్రసన్న కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో పరాకాష్టకు చేరినట్లు స్పష్టమవుతోంది. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు గత కొంత కాలంగా దూరంగా మసులుతున్నారు. ఆ కారణంగా ఆయన ప్రమేయం లేకుండానే జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో మేకపాటి వర్గం ఆద్వర్యంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు మరింత ఆగ్రహించిన ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు తన అధ్యక్ష పదవికి రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు.

 

కానీ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వార్తలను ఖండించారు. జిల్లా నేతలతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, కేవలం తన నియోజక వర్గంపైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతోనే అధ్యక్ష బాధ్యతల నుండి తప్పు కోవాలనుకొంటున్నానని, కానీ ఇంతవరకు తను రాజీనామా చేయలేదని తెలిపారు. పార్టీని వీడుతానని వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తను వైకాపాను, జగన్మోహన్ రెడ్డిని ఎన్నడూ విడిచిపెట్టనని రాజకీయాలలో ఉన్నంత కాలం వైకాపాలోనే కొనసాగుతానని చెప్పారు. నిజానికి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రతీ పార్టీలో చాలా మంది పోటీ పడుతుంటారు. జిల్లా రాజకీయాలను శాశించగల అటువంటి కీలకపదవిని ఏదో బలమయిన కారణం ఉంటే తప్ప ఎవరూ వదులుకోరు. కనుక జిల్లా అధ్యక్ష పదవిని వదులుకోవడానికి ఆయన చెపుతున్న కారణాలు సహేతుకంగా లేవని స్పష్టం అవుతోంది.