కేసీఆర్ కు కరోనా అక్కడే అంటిందా?  

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా సోకింది. ప్రస్తుతం ఫామ్ హౌజ్ లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు ప్రకటించారు.  సీఎం కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ముఖ్యమంత్రిని పర్యవేక్షిస్తుందని చెప్పారు. కేసీఆర్ కోసం యశోద హాస్పిటల్ లో ప్రత్యేక గదిని సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కు కరోనా సోకిందన్న వార్తలతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఇటీవల ఉప ఎన్నిక జరిగిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గం కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. సాగర్ నియోజకవర్గంలో సోమవారం 160 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా భారీగానే కేసులు వచ్చాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. వీళ్లతో పాటు సాగర్ లో ప్రచారం నిర్వహించిన నేతల్లో చాలా మందికి కరోనా సోకిందని తెలుస్తోంది. 

ఈనెల 14న హాలియాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో కలిసి వేదిక పంచుకున్నారు. బహిరంగ సభలో కేసీఆర్ మాస్క్ ధరించలేదు. వేదికపై నోముల భగత్ తో చాలా సార్లు మాట్లాడారు కేసీఆర్. సభ తర్వాత చాలా మంది నేతలకు కేసీఆర్ తో కరచాలనం చేశారు. గుంపులు గుంపులుగా కేసీఆర్ చుట్టూ చేరారు నేతలు. హాలియా సభలో వేదికపై కూర్చున్న చాలా మంది నేతలకు కరోనా నిర్దారణ అయిందని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ కు హాలియా సభలోనే కరోనా సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. 

తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు కరోనా బారినపడడంతో ఆయన క్షేమాన్ని కోరుకుంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో స్పందించారు. కొవిడ్-19 నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ పరిపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.