ఆలేరులో పట్టుబడ్డ సొత్తు

 

ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల నేపథ్యంలో డబ్బును తరలించటానికి కొందరు  వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పోలీసులు వాళ్ళ ప్రయత్నాలను భగ్నం చేసేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బస్సు లో తరలిస్తున్న, కారు సీట్లలో దాచిన సొమ్మును పట్టుకున్నారు. ఇంకొకరు మరో అడుగు ముందుకేసి టాటా ఏస్ వాహనంలో పీవీసీ పైపులలో డబ్బులు తరలిస్తూ దొరికిపోయారు. తాజాగా మరో టాటా ఏస్ వాహనంలో కప్పు సాసర్లతో కూడిన అట్ట పెట్టెల్లో డబ్బును తరలిస్తూ ఒకరు దొరికిపోయారు.

వివరాల్లోకి వెళ్తే...యాదాద్రి జిల్లా ఆలేరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈరోజు ఉదయం  5 గంటల సమయంలో  హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు టాటా ఏస్‌ వాహనం వెళుతున్న క్రమంలో చెక్‌ పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. వాహనంలో కప్పు సాసర్లతో కూడిన అట్ట పెట్టెలు ఉన్నాయి. వీటిని నిశితంగా పరిశీలించిన పోలీసులు ఒక పెట్టెలో ఉన్న నగదును గుర్తించి స్వాధీన పరుచుకున్నారు. డ్రైవర్‌ శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి తొర్రూరుకు ఈ నగదును తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు. నగదు మొత్తం రూ.13.3 లక్షలని ఎస్సై తెలిపారు.