ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస ఓటమికి అదే కారణమా?
posted on Mar 28, 2015 1:38PM
యం.యల్.సి.ఎన్నికలలో అధికార తెరాస పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన తెలంగాణా ఎన్జీవో సంఘాల నాయకుడు దేవీ ప్రసాదరావు ప్రజలకి చాలా సుపరిచితుడయినప్పటికీ బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు చేతిలో ఓడిపోవడం ప్రతిపక్షపార్టీలనే కాక, తెరాసకు కూడా చాలా విస్మయం కలిగించింది. రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నేతలు అందుకు రకరకాల కారణాలు చెపుతున్నారు. దేవీ ప్రసాద్ ని ఓడించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వంపై తెలంగాణా ప్రజలు తమ ఆగ్రహం వెళ్ళబుచ్చారని తెదేపా శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒంటెత్తు పోకడలు, నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ప్రజలు తెరాస అభ్యర్ధిని ఓడించారని ఆయన అన్నారు. యం.యల్సీ. ఎన్నికలలో ఘోరపరాజయం పొందిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేసారు. అయితే తెలంగాణా ఇచ్చింది తెచ్చింది తామేనని చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో కారణాలు చెప్పడానికి ఇష్టపడటం లేదు.
తమ పార్టీకి సంస్థాత నిర్మాణం లేనందునే ఓటమి పాలయ్యామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ సమర్ధ పాలనకు మెచ్చే ప్రజలు తమ అభ్యర్ధి రామచంద్రరావుని గెలిపించారని బీజేపీ నేతలు చెపుతున్నారు. ఒకవేళ తెరాస అభ్యర్ధి ఓటమికి తెదేపా, కాంగ్రెస్ నేతలు చెపుతున్న కారణాలు నిజమనుకొంటే, అప్పుడు తెరాస అభ్యర్ధి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా గెలిచి ఉండకూడదు. కానీ గెలిచారంటే వారు చెపుతున్న కారణం సహేతుకంగా లేదని అర్ధమవుతోంది.
ఈ యం.యల్సీ. ఎన్నికల ఫలితాలపై పార్టీల బలాబలాల ప్రభావం ఉందనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. కానీ అంతకంటే ఎక్కువగా అభ్యర్ధుల వ్యక్తిగత బలాబలాలు ఈ ఎన్నికలలో ఎక్కువ ప్రభావం చూపాయని వెలువడిన ఫలితాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణా ఎన్జీవో సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్ ప్రజలకు సుపరిచితుడే. కానీ బీజేపీ అభ్యర్ధి రామచంద్ర రావుతో పోల్చి చూసినట్లయితే ఆయనకు రాజకీయ అనుభవం లేదు. ఒకవేళ కేసీఆర్ ఆయనను రాజకీయాలలోకి రప్పించాలనుకొని ఉంటే, ఆయనకు సురక్షితమయిన యం.యల్యే.కోటాలో జరిగే యం.యల్సీ. ఎన్నికలలో అభ్యర్ధిగా ప్రకటించి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ ఆయనని తెరాస అభ్యర్ధిగా పట్టభద్రుల యం.యల్సీ. ఎన్నికలలో ఆఖరు నిమిషంలో పోటీకి దింపడం తప్పు నిర్ణయమేనని చెప్పక తప్పదు. బహుశః ఆయన ఓటమికి ఇది కూడా ఒక కారణమని భావించవచ్చును.
బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రామచంద్ర రావుకి ఆయన స్వంత పార్టీ క్యాడర్ మాత్రమే కాకుండా, తెదేపా క్యాడర్ కూడా అండగా నిలబడటం కూడా కలిసి వచ్చింది. అయితే దేవీ ప్రసాద్ ఓటమితో తెరాసకే ఎదురుదెబ్బ తగిలినట్లు ఎందుకు భావిస్తున్నారంటే ఆ పార్టీ తమ గెలుపై చాలా ధీమా, అతివిశ్వాసం ప్రదర్శించినందునే. పైగా త్వరలో జి.హెచ్.యం.సి. ఎన్నికలు కూడా ముంచుకు వచ్చేస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం వాటిపై ఎక్కడ పడుతుందో అని తెరాస కంగారుపడుతుంటే, అది చూసి ప్రతిపక్షాలు కూడా తెరాస అభ్యర్ధి ఓటమిని ప్రజాతీర్పుగా అభివర్ణిస్తున్నాయి. కానీ కర్ణుడి ఓటమికి వెయ్యి కారణాలన్నట్లు దేవీ ప్రసాద్ ఓటమికి కూడా అనేక కారణాలు కనబడుతున్నాయి.