రేషన్ బియ్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం.. అసలేం జరిగిందంటే?

 

ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని చెప్పింది. అయితే నాణ్యం మాట దేవుడెరుగు, గతంలో కంటే నాసిరకమైన బియ్యం పంపిణీ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని నిర్ణయించి, ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో జిల్లాలో పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇలా పంపిణీ అయిన బియ్యం సంచుల్లో ముక్కిపోయిన బియ్యం వెలుగులోకి రావడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలాయి. ముఖ్యంగా ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. "సంచి ఘనం, బియ్యం దారుణం".. "సంచి డిజైన్ మీద పెట్టిన శ్రద్ధతో సగం బియ్యం మీద పెట్టుంటే బాగుండేది" అంటూ ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవేనా మీరు ఇస్తానన్న నాణ్యమైన బియ్యం అంటూ మండిపడుతున్నారు.

 

 

ఈ విషయంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. వైసీపీ వైఫల్యాలకు వారు పంపిణీ చేసిన బియ్యమే రుజువు అని అన్నారు. ముందు ‘సన్నబియ్యం’ అని చెప్పి తరువాత నాణ్యమైన బియ్యం అని మాట మార్చి చివరకి ‘బియ్యం చెక్కలు’ ఇచ్చారని ఎద్దేవాచేశారు. శ్రీకాకుళం జిల్లా 8 మండలాల్లో ‘చెక్క బియ్యం’ సరఫరా చేశారని, బియ్యం చెక్కలు తీసుకున్న పేదల వ్యాఖ్యలే ప్రత్యక్ష రుజువని యనమల చెప్పారు. మీ ముడుపుల కోసం బియ్యం చెక్కలు పేదలకు పంపిణి చేస్తారా? అని వైసీపీ సర్కార్ పై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని అంటున్నారు. ఈ విషయంపై ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. రేషన్ బియ్యం పంపిణీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత నాలుగైదు రోజులగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయని.. అన్ని ఇబ్బందులను అధిగమించి నాణ్యమైన బియ్యాన్ని రవాణా చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కారణంగా 30 బియ్యం సంచులు తడిసిపోయాయని.. వాటి స్ధానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామన్నారు. పేదవాళ్లకు ఇంత మంచి జరుగుతుంటే.. తినగలిగే బియ్యాన్నే పంపిణీ చేస్తుంటే.. టీడీపీ ఓర్వలేకపోతోందని మంత్రి మండిపడ్డారు. నాణ్యమైన బియ్యం ఇవ్వడం లేదని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.