పిచ్చికుక్కల సీజన్ మొదలైంది...
posted on Apr 18, 2015 2:53PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పిచ్చికుక్కల సీజన్ మళ్ళీ మొదలైంది. రెండేళ్ళ క్రితం అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిచ్చికుక్కలు రెచ్చిపోయి స్వైర విహారం చేసి వందలాది మంది మృతికి కారణం అయ్యాయి. వాటి ధాటికి మనుషులు కుక్కలను చూస్తేనే భయంతో వణికిపోయే పరిస్థితికి చేరుకున్నారు. ఏ ఆస్పత్రిలో బెడ్లు చూసినా పిచ్చికుక్కలు కరిచిన పేషెంట్లతో నిడిపోయి వుండేవి. ప్రతిరోజూ కనీసం ఇద్దరు ముగ్గురైనా పిచ్చికుక్కల బారిన పడి మరణించేవారు. పిచ్చికుక్కలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం పెద్ద గుణపాఠం నేర్చుకుంది. అయితే ఇప్పుడు రాష్ట్రం విభజన కావడం వల్లనో, మతిమరుపు వల్లనోగానీ, అధికారులు అప్పుడు నేర్చుకున్న గుణపాఠాన్ని మరచిపోయినట్టున్నారు. అందుకే మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పిచ్చికుక్కల సీజన్ మొదలైంది.
మొన్నటికి మొన్న గుంటూరు జిల్లా కాకుమానులో పిచ్చికుక్కలన్నీ ఒక ఆరేళ్ళ పసిపాప మీద మూకుమ్మడిగా దాడి చేసి ఆ చిన్నారి పాప ప్రాణాలు తీసేశాయి. మా ఊళ్ళో పిచ్చికుక్కలు పెరిగిపోయాయి మహాప్రభో అని అంతకుముందు ఎన్నో రోజుల నుంచి ఆ గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. అధికారుల ఈ నిర్లక్ష్యానికి ఫలితం... ముక్కుపచ్చలారని పసిపాప... ఎంతో భవిష్యత్తు వున్న ఒక బాలిక తన ప్రాణాలను కోల్పోయింది. పసిపాప మీద కుక్కలు దాడి చేసి చంపిన ఈ ఘటన ప్రభుత్వ అధికారుల వైఫల్యానికి దారుణమైన నిదర్శనం. ఈ ఘటన తర్వాత అయినా మేలుకుని కుక్కలను అదుపు చేయాల్సిన అధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారు. దాంతో శనివారం నాడు కూడా ఆ కుక్కల మంద మరోసారి తమ ప్రతాపం చూపించాయి. అయితే ఈసారి మనుషుల మీద కాకుండా పశువుల మీద చూపించాయి. కుక్కలు జరిపిన దాడిలో ఒక లేగదూడ మరణించింది. మరో లేగదూడ తీవ్రంగా గాయపడింది. ఈ లేగదూడల స్థానంలో మనుషులు వుంటే ఆ దారుణాన్ని ఊహించలేం.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా వుంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి మొదలైంది. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం గౌసాబాద్ గ్రామంలో శనివారం నాడే పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. ఊళ్ళో జనం మీద పడి విచక్షణా రహితంగా కరిచేశాయి. ఈ పిచ్చికుక్కల బారిన పడి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి మరీ దారుణంగా వున్నట్టు తెలుస్తోంది. అలాగే శనివారం నాడే కరీంనగర్ జిల్లా భీమదేవర పల్లిలో పిచ్చికుక్కలు 10 మందిని దారుణంగా కరిచేశాయి.
కుక్కలకు పిచ్చిపట్టడం, జనం మీద పడి కరవడం సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువగా జరుగుతూ వుంటుంది. ఇది అధికారులకు తెలిసిన విషయమే. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే ఎండాకాలం ప్రారంభమైంది. ముందు ముందు ఎండలు పెరిగేకొద్దీ కుక్కల్లో ప్రకోపం పెరిగే ప్రమాదం కూడా వుంది. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు ఈ దిశగా ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే సదరు అధికారులు కూడా ఈ కుక్కల బారిన పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదీ విషయం... రెండేళ్ళ క్రితం వచ్చిన పరిస్థితి మళ్ళీ రాకుండా చేసే శక్తి అధికారులకే వుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే.... పిచ్చిపట్టిన కుక్కలకంటే అధికారులే మరింత ప్రమాదకరమైన వారిగా భావించాల్సి వుంటుంది.