హైదరాబాదీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్?

 

కొద్ది రోజుల క్రితం భవ్యశ్రీ చరిత అనే హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం కావడం, పోలీసులు ఆమెకోసం తీవ్రంగా గాలించడం, ఆ తర్వాత ఆమె తాను సొంతగానే వైజాగ్ వెళ్ళిపోయానని చెప్పడం తెలిసిందే. జనం ఇంకా ఆ సంఘటన గురించి మరచిపోకముందే హైదరాబాద్‌ నగరంలో మరో లేడీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యమైంది. హైదరాబాద్‌కి చెందిన భరణి అనే యువతి కొంతకాలంగా బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఈనెల 26వ తేదీ రాత్రి 9 గంటలకు భరణిని తండ్రి ఆమెను ఎంజీబీఎస్‌లో బెంగళూర్ వెళ్లే బస్సు ఎక్కించాడు. ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత భరణికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. ఆయన అర్ధరాత్రి వరకు ఫోన్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆయన మర్నాడు బెంగళూర్‌లో ఆమె పని చేసే కంపెనీకి ఫోన్ చేసి వాకబు చేయగా భరణి రాలేదని చెప్పారు. దీంతో భరణి కుటుంబ సభ్యులు బంధువులు, మిత్రుల ఇళ్లలో ఆరా తీశారు. అయినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.