కేసీఆర్ బర్త్ డే వేడుకలు జరపొద్దు : కేటీఆర్

 

ఏదైనా పార్టీ అధినేత బర్త్ డే వస్తుందంటే చాలు.. కార్యకర్తలు, స్థానిక నేతలు బ్యానర్లు, ప్రకటనలతో హడావుడి చేస్తారు. ఆ సమయంలో రోడ్డు మీదకి వస్తే చాలు చుట్టూ 'మా మహా నేతకు జన్మదిన శుభాకాంక్షలు' అనే బ్యానర్లే దర్శనమిస్తాయి. వీటికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా కనిపించట్లేదు. అయితే తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడంటూ పిలుపునిచ్చారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు ఉంది. అసలే కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తరువాత వచ్చిన మొదటి పుట్టినరోజు. ఇక కార్యకర్తలు, నేతలు ఏ రేంజ్ లో హడావుడి చేస్తారో తెలిసిందే. ఇది దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ బర్త్‌డేకు దుబారా ఖర్చులు చేయొద్దని టీఆర్ఎస్ శ్రేణులకు ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్ సూచించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలెవరూ బ్యానర్లు, ప్రకటనల కోసం వృథా ఖర్చు చేయొద్దని స్పష్టంచేశారు. అందరూ మొక్కలు నాటి కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు.