ఎంతో సాధించి.. చివరికి పరువు కోసం ప్రాణాలు తీసుకున్న పల్నాటి పులి

నేడు డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మొదటి వర్థంతి. రూపాయి డాక్టరుగా పేదల మనసు గెలిచిన ఆయన.. ఎన్టీఆర్ ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చారు. అలనాటి అరాచకాలకు ఎదురు నిలిచి, పల్నాటి గడ్డలో అభివృద్ధికి బాటలు పరిచి.. నరసరావుపేట కి నగిషీలు అద్ది, కోటప్పకొండకు కొత్త రూపు తెచ్చి పల్నాటి పులిగా పేరుతెచ్చుకున్నారు.

 

గుంటూరు జిల్లా కండ్లగుంట గ్రామంలో 1947 మే 2 వ తేదీన సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు కోడెల జన్మించారు. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే ఉన్నా.. ఆయన తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించారు.

 

పల్నాడు ప్రాంత పేదప్రజలకు వైద్యసేవలు అందించాలని నరసరావుపేటలోని రాజాగారికోటలో ఆసుపత్రి నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు కోడెల. ఆయన దగ్గరకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవారు అధికంగా వచ్చేవారు. వైద్యవృత్తిని ఎప్పుడూ కోడెల సంపాదన మార్గంగా చూడలేదు. అందుకే ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించకుండా డాక్టరు కోడెల ఉన్నారన్న ధైర్యంతో ఆసుపత్రి గడప తొక్కేవారు. ఆయన పేదల డాక్టరుగా, రూపాయి డాక్టరుగా ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.

 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ దృష్టి కోడెల సేవపై పడి, 1983లో పార్టీలోకి ఆహ్యానించారు. రాజకీయాల ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలన్న తలంపుతో ఎన్టీఆర్ పిలుపు మేరకు కోడెల తెలుగుదేశంలో చేరారు. మొదటిసారిగా ఆయన నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే, మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు వరుసగా నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రి వర్గాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసన స్పీకర్ గా పనిచేశారు. 

 

ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై ఆయన రాజీ లేని పోరాటం చేశారు. వైఎస్‌ హయాంలో రైతుల కోసం గొంతెత్తి లాఠీ దెబ్బలు తిని.. జైలుకు వెళ్లారు. కోటప్పకొండ పవిత్రతను కాపాడాలంటూ నరసరావుపేట నుంచి కొండపైదాకా నడిచారు. కోటప్పకొండ ఆలయ అభివృద్ధికి కోడెల ఎంతో కృషి చేశారు.

 

స్వచ్ఛఆంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛఆంధ్రప్రదేశ్ లో భాగంగా కోడెల సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో చొరవ చూపించి దేశానికే ఈ నియోజకవర్గం ఒక దిక్సూచిగా నిలిపారు.

 

ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఏదో ఒక సామాజిక సేవ చేయడం కోడెల ఆనవాయితీ. పుట్టినరోజు సందర్భంగా ఒకసారి 50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి రికార్డు సృష్టించారు. 2017 మే 2న కోడెల పుట్టినరోజు సందర్భంగా నరసరావుపేటలో పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించారు. 11,987 మంది గుంటూరు జిల్లా ప్రజలు అవయవదానానికి అంగీకారం తెలిపి గిన్నీస్‌ రికార్డు సృష్టించారు.

 

టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చినా ఆయన ఎన్నడూ కండువా మార్చలేదు. 36 ఏళ్లు టీడీపీలోనే ఉన్నారు. పార్టీ మారమని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా కించపరచినా ఎప్పుడూ పార్టీ మారలేదు. డాక్టర్ గా, రాజకీయ నాయకుడిగా.. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఎంతో సేవ చేసి.. పేదల మనిషిగా, పల్నాటిపులిగా పేరు తెచ్చుకున్న ఆయన.. కొందరు ఆయనపై వేసిన నిందలను, తప్పుడు ప్రచారాలను తట్టులోలేక.. మానసికంగా కృంగిపోయి.. గతేడాది ఇదే రోజున అవమానలను భరించలేక పరువుకోసం ప్రాణం తీసుకున్నారు.