వచ్చే ఏడాది నుంచి ఉద్యోగుల వేతనాలను పెంచనున్న కేసీఆర్!!

 

నవంబర్ నెలలో పిఆర్‌సి ప్రకటన చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రానున్న 10 - 12 రోజుల్లో వేతన సవరణ కమిటీ (పిఆర్‌సి) నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు పిఆర్‌సి కమిటీ ఇప్పటికే తయారు చేసుకున్న నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఏడాది నుంచి  వేతనాలు పెంచనున్నట్లుగా తెలిపారు. ఉద్యోగులకు 27 నుండి 35 శాతం మధ్య ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. నివేదికలో కూడా ఇదే విధంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాఖలు, కేడర్ వారీగా కనీస, గరిష్ఠ మూల వేతనం, అలవెన్సులను నివేదికలో ప్రతిపాదిస్తున్నారు పిఆర్‌సి చైర్మన్ సిఆర్ బిశ్వాల్. 

ఒక పక్క ఉద్యోగ సంఘాలు 43 శాతం ఐఆర్, 63 శాతం ఫిట్‌మెంట్, రూ.24 వేల కనీస వేతనాన్ని సిఫారసు చేయాలంటూ కోరుతున్నాయి. ఫిట్‌మెంట్ 63 శాతం ఇవ్వాలని పిఆర్‌సికి టీఎన్‌జీఓ, టీజీఓ విజ్ఞప్తి చేశాయి. వారి డిమాండ్లకు అనుగుణంగా నివేదిక ఉండే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.  సాధారణంగా వేతన స్కేళ్లు..విభాగాల వారీగా ఉద్యోగులు.. వాళ్ళు చేస్తున్న పని.. వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు.. ఇవన్నీ పిఆర్‌సి నివేదికలో ఉంటాయి. అవన్నీ పరిశీలించిన తరువాతే ఎంత మేరకు ఫిట్‌మెంట్ ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇందుకు మూడు బృందాలను నియమించి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వేతనాలు, వేతన సంస్కరణలపై అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేకపోవడంతో నివేదిక సిద్ధం చేసే పని కూడా ఆలస్యమైంది. ఆగస్టు 25వ తేదీనే కమిటీ గడువు ముగిసింది. అయినా ప్రభుత్వం గడువును పొడిగించింది.