జేసీ కోసం తెదేపా పరిటాలను వదులుకోగలదా?

 

అనంతపురంలో కాంగ్రెస్ పార్టీకి జేసీ.దివాకర్ రెడ్డి కుటుంబము, తెదేపాకు పరిటాల కుటుంబము పాతకాపుల వంటివి. వారివల్లనే అక్కడ ఆ రెండు పార్టీలు నువ్వా నేనా? అన్నట్లు కొనసాగుతున్నాయి. సీమాంధ్రలో రాష్ట్ర విభజన రగిల్చిన చిచ్చుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేకమంది కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. వారిలో జేసీ.దివాకర్ రెడ్డి కూడా ఒకరు.

 

ఈ విభజన చిచ్చుకు తోడు రెండు నెలల క్రితం పాలెం బస్సు దుర్ఘటన తరువాత దివాకర్ ట్రావెల్స్ సంస్థకు చెందిన అనేక బస్సులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆదేశాలతో రవాణాశాఖా అధికారులు కేసులు నమోదు చేసి కదలనీయకుండా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకే ఈ సాకుతో బొత్ససత్యనారాయణ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భావిస్తున్న, దివాకర్ రెడ్డి నేరుగా సోనియా గాంధీ, బొత్ససత్యనారాయణలపై విమర్శలు ఆరంబించారు. ఈ కధ ఇప్పుడు షో-కాజ్ నోటీసుల క్లైమాక్స్ సీనుకి చేరుకోవడంతో, జేసీ బ్రదర్స్ వేరే పార్టీలోకి మారక తప్పని పరిస్థితి ఏర్పడింది.

 

అనంతపురంలో ఇంతవరకు పరిటాల కుటుంబంపైనే ఆధారపడి ఉన్నతెదేపా, ఇదే అదునుగా జేసీ కుటుంబాన్నికూడా పార్టీలోకి రప్పించగలిగితే, ఇక జిల్లాలో తమ పార్టీకి తిరుగే ఉండదని భావించి ఆ దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే తమ రాజకీయ ప్రత్యర్దులయిన జేసీ బ్రదర్స్ కుటుంబాన్ని తెదేపాలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను పరిటాల కుటుంబం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ఒకవేళ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తే తాము పార్టీని వీడక తప్పదనే బలమయిన సంకేతాలు కూడా ఇచ్చారు.

 

అయితే ఎలాగయినా పరిటాల సునీతను ఒప్పించి, కనీసం దివాకర్ కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని తెదేపా ప్రయత్నిస్తోంది. పవన్ కుమార్ రెడ్డి తెదేపాలో చేరిక దాదాపు ఖాయమయినట్లు తాజా సమాచారం. జేసీ బ్రదర్స్ తెదేపాలో చేరకపోయినా, పవన్ కుమార్ రెడ్డికి తెదేపా టికెట్ కూడా ఇచ్చేందుకు సంసిద్దత చూపుతుండటంతో షాక్ తిన్నజిల్లా తెదేపా ఇన్-చార్జ్ పేరం నాగిరెడ్డి కుటుంబంతో సహా తేదేపాకు గుడ్ బై చెప్పి వైకాపాలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన కోడలు సరోజినీ దేవికి టికెట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించినట్లు తాజా సమాచారం.

 

ఇంతకాలం జిల్లాలో తెదేపాకు వెన్నుదన్నుగా నిలచిన పరిటాలను జేసీ కుమారుడి కోసం తెదేపా వదులుకోగలదా? లేక పరిటాల కుటుంబం తాము తీవ్రంగా వ్యతిరేఖించే జేసీ కుటుంబం వచ్చి పార్టీలో జేరితే వారితో ఇమడగలదా? పరిటాల సునీత ఏవిధంగా స్పందిస్తారో త్వరలోనే తెలియవచ్చును.