భారత్-అమెరికాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన

 

భారత దౌత్యాధికారి దేవయాని కొబ్రాగడే అరెస్ట్ వ్యవహారంలో మొదట భారత్ కొంత వెనక్కి తగ్గినట్లు కనబడటంతో, దేవయాని స్వయంగా కోర్టుకి హాజరవనవసరం లేకుండా అమెరికా మినహాయింపు ఇవ్వడంతో క్రమంగా అంతా సర్దుకొంటోందని అందరూ భావిస్తున్నతరుణంలో, అమెరికా దౌత్య కార్యాలయాలలో పనిచేస్తున్నఉద్యోగుల గుర్తింపు కార్డులను, వారికి భారత్ కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను అన్నిటినీ భారత్ రద్దు చేసి, వారికి కూడా భారత్ దౌత్యకార్యాలయాలో పనిచేసే ఉద్యోగులకు అమెరికా ఎటువంటి కార్డులు, సౌకర్యాలు ఇస్తుందో అటువంటివే ఈ రోజు జారీ చేయడంతో కధ మళ్ళీ మొదటికి వచ్చింది.

 

దేవయానిపై అమెరికా పోలీసులు మోపిన కేసుని రద్దు చేసి, ఆమెపట్ల అవమానకరంగా వ్యవహరించినందుకు అమెరికా క్షమాపణ చెప్పాలని భారత్ కోరుతోంది. అయితే అందుకు అంగీకరించబోమని అమెరికా తెగేసి చెప్పడంతో, దేవయానికి అమెరికా చట్టాల నుండి రక్షణ కల్పించేందుకు ఆమెను ఐక్యరాజ్య సమితికి భారత ప్రతినిధిగా శాశ్విత ప్రాతిపాదికన నియమిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దానివలన ఆమెపై అంతకు ముందు మోపబడిన కేసుల నుండి విముక్తి కలిగించలేవని అమెరికా చెప్పడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, అమెరికా దౌత్య ఉద్యోగులకు భారత్ కల్పిస్తున్న విశేష సౌకర్యాలను అన్నిటిని రద్దు చేసి, భారత్ దౌత్య ఉద్యోగులతో అమెరికా ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తుందో భారత్ కూడా అమెరికా ఉద్యోగులతో అదేవిధంగా వ్యవహరించాలని నిశ్చయించుకొని తదనుగుణంగా చర్యలు చెప్పట్టింది.

 

ఈగొడవకంతటికీ కారణమయిన దేవయాని ఇంట్లో పనిచేసే పనిమనిషి భర్తను, భారత ప్రభుత్వానికి తెలియజేయకుండా భారత్ నుండి అమెరికా తన స్వంత ఖర్చులతో రహస్యంగా అమెరికాకు తరలించడంతో అమెరికా కూడా భారత్ కోర్టుల దృష్టిలో నేరం చేసినట్లయింది. దేవయాని అరెస్ట్ తరువాత నుండి రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నపటికీ, అమెరికా ఇసుమంత కూడా వెనక్కి తగ్గేందుకు సముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది.

 

ఈ వ్యవహారం చివరికి ఏ విధంగా ముగుస్తుందో, ఏ పరిణామాలకు దారి తీస్తుందో కాలమే చెప్పాలి. మారుతున్న కాలంతో బాటు అమెరికా కూడా తన పెద్దన్న ధోరణిని వదులుకొని అందరితో సమానంగా మెలగడం నేర్చుకోవాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ కుర్షీద్ అన్నారు.