మేం రాజీనామా చేస్తాం.. మీరు తీసుకొస్తారా?
posted on Sep 2, 2015 4:02PM
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు కూడా అలాగే ఏపీకి ప్రత్యేకహోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఏపీ ప్రత్యేక హోదాపై వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే ఇరు పార్టీల వాదనల జరుగుతుండగా వచ్చిన జేసీ తనదైన శైలీలో స్పందించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని జగన్ అన్నారు.. ‘‘అందుకు నేను సిద్ధంగానే ఉన్నా. నేనే కాదూ... మరో పది మంది ఎంపీలు 24 గంటల్లో రాజీనామా చేస్తాం అన్నారు. కానీ మేము రాజీనామా చేస్తే జగన్, కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎంలు ప్రత్యేక హోదాను తీసుకువస్తాయా? ఒకవేళ తీసుకురాలేకపోతే మేము రాజీనామా చేసిన స్థానాల్లో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టకూడదు. దీనికి ఆ పార్టీలు సిద్ధమేనా?’’ అని ఆయన సవాలు చేశారు.
అంతేకాక రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆహర్నిశలు కష్టపడి.. రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఏమోచ్చింది.. రాష్ట్రం విడిపోకుండా ఆగిందా.. ఇప్పుడూ అంతే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం లేకపోయినా.. బిహార్ కంటే మంచి ప్యాకేజీ మాత్రం ఏపీకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గురించి గొంతు చించుకుంటున్నవారికి దానివల్ల వచ్చే ప్రయోజనం తెలుసో? లేదో?అని ఎద్దేవా చేశారు.