మూడు నెలల్లో జైళ్ళు క్లీన్
posted on Oct 1, 2014 7:18AM
తెలంగాణ జైళ్లను మూడు నెలల్లోగా అవినీతిరహితంగా మార్చివేస్తామని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్ తెలిపారు. దీని కోసం నాలుగు దశల్లో ఒక ప్రత్యేక విధానాన్ని అమలుపరచనున్నట్టు చెప్పారు. ఈ విధానం అమలయ్యేలోగా జైళ్లశాఖ సిబ్బంది తీరు మారకుంటే అందుకు తానే పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తానని వీకే సింగ్ ప్రకటించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి పురస్కరించుకుని మహాత్ముడి సాక్షిగా రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల జైళ్లలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించనున్నట్టు తెలిపారు. ప్రతిజ్ఞ, కౌన్సిలింగ్, హెచ్చరికలు ఇలా తొలి మూడు దశల్లోనూ సిబ్బంది తీరు మార్చుకోకుంటే, నాలుగో దశలో శాఖపరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సంస్కరణల ద్వారా తెలంగాణ జైళ్లను ఆధునీకరించి దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో తెలంగాణలోని అన్ని జైళ్లలో జామర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా జైళ్ళలో తేనున్న సంస్కరణలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.