పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు...15 రోజులు ఆగండి లెక్కలు తేలుస్తా !

 

గత ఐదు రోజులుగా వాడీవేడిగానే సాగుతున్న  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు కూడా అలాగే మొదలయ్యాయి. సభ ప్రారంభం నుండే పోలవరం ప్రాజెక్టుపై చర్చకు టీడీపీ పట్టుబట్టగా అధికారపక్షం మాత్రం కుదరదని చెప్పింది. దీంతో స్పీకర్ తీరుపై టీడీపీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ తీరు మీద జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం విషయం మీదబే సభలో మూడు రోజులుగా చర్చిస్తూనే ఉన్నామని పేర్కొన్న జగన్, పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు అని తీవ్ర వ్యాఖలు చేశారు. 

ఈ విషయమై తాము నియమించిన నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. తాను ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించానని జగన్ తెలిపారు. అక్కడ 4 నెలలుగా పనులు ఆగిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. స్పిల్‌వే పూర్తి కాకుండా కాపర్‌డ్యామ్‌ చేపట్టడంతో నష్టం జరిగిందని, జూన్‌ 2021 నాటికి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని జగన్ తెలిపారు. 

పోలవరం పనులను  రీటెండరింగ్‌ చేసి బిడ్డింగ్ లో ఎవరు తక్కువకు కోట్ చేస్తే వాళ్లకే పనులు అప్పగిస్తామనీ, దీనివల్ల మొత్తం వ్యయంలో 15-20 శాతం నిధులు మిగిలే అవకాశముందని వ్యాఖ్యానించారు. 6,500 కోట్ల విలువైన పనుల్లోనే 15-20 శాతం నిధులు అంటే 1500 కోట్ల దాకా మిగిలే అవకాశముందని జగన్ పేర్కొన్నారు.  పోలవరం ప్రాజెక్టులో టీడీపీ నేతలు ఎంత దోచుకున్నారో మరో 15 రోజుల్లో అంతా బయటకొస్తుందని జగన్ పేర్కొన్నారు.