జగన్ మీద లోకేష్ సెటైర్



ప్రస్తుతం ఏం చేయాలో అర్థంకాక ప్రాజెక్టుల దగ్గరకి బస్సు యాత్ర చేపట్టిన వైసీపీ నాయకుడు జగన్ మీద తెలుగుదేశం నాయకులు వాగ్బాణాలు సంధిస్తున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కార్యకర్తల సంక్షేమానికి పార్టీ నిరంతరం కృషి చేస్తుంది. రాయలసీమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పాటుపడుతున్నారు. పట్టిసీమ విషయంలో జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే పిల్ల కాంగ్రెస్ కనుమరుగవటం ఖాయం’’  అన్నారు.

అలాగే మరో సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హోమంత్రి చినరాజప్ప జగన్ బస్సు యాత్ర మీద మండిపడ్డారు. రాజకీయ మనుగడ కోసమే వైకాపా నాయకులు బస్సు యాత్ర చేపట్టారని ఆయన ఆరోపించారు. ఈడీ జగన్‌కి సంబంధించిన ఆస్తులను, డబ్బును జప్తు చేస్తుంటే జగన్ ఎందుకు కిక్కురుమనడం లేదని ఆయన ప్రశ్నించారు.

అలాగే, జగన్ కక్కుర్తి వల్లే ఆనాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. పోలవరం టెండర్లు పిలవటానికి కాంగ్రెస్ పార్టీకి నాలుగేళ్ళు పట్టిందని, తమ ప్రభుత్వం ఏడాది లోగానే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేస్తుందని ఆయన చెప్పారు.