గ్రాండ్ సితార హోటల్లో కుట్రకు అంకురార్పణ?

 

తెదేపాను అప్రదిష్టపాలు చేసి తెలంగాణాలో లేకుండా చేసేందుకు, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెరాస నేతలతో చేతులు కలిపి కుట్రలు పన్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డిని ఓటుకి నోటుకి కేసులో అరెస్ట్ చేయడానికి సరిగ్గా 10రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి తెరాస మంత్రి హరీష్ రావు, నామినేటడ్ ఎం.యల్యే ఎల్వీస్ స్టీఫెన్ సన్ తో సమావేశమయ్యారని రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కానీ ఎందుచేతో ఆయన పూర్తి వివరాలను బహిర్గతపరచలేదు. కానీ టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ నిన్న మరో ఆస్కతికరమయిన రహస్యాన్ని బయటపెట్టారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మే 21వ తేదీన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న గ్రాండ్‌ సితార హోటల్లో కొందరు నేతలతో సమావేశమయ్యారని తెలిపారు. ఆయన ఎవరెవరితో సమావేశమయ్యారు? అసలు ఎందుకు సమావేశమయ్యారు? అని ఆమె ప్రశ్నించారు. ఈ కుట్రలలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని చెప్పడానికి అదే నిదర్శనమని ఆమె ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి తన బెయిల్ గురించి మాట్లాడుతారు కానీ సెక్షన్: 8 గురించి నోరు మెదపరు,” అని ఆమె విమర్శించారు.