జగన్నాటక సూత్రదారి నిజ దర్శనం నేడే

 

 

అధికారంలో ఉండి ముఖ్యమంత్రి సైతం చేయలేని పనిని ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అవలీలగా సాధించి చూపాడు. అనేక మంది మంత్రులను, ఐఏయస్ అధికారులను, వ్యాపారవేత్తలను, పారిశ్రామిక వేత్తలను అందరికీ కూడా చంచల్ గూడా జైలు భోజనం రుచి చూపించిన ఘనుడు జగన్. ఆ విధంగా అంతమందికి జైలులో ట్రీట్ ఇవ్వడం ఎవరికీ సాద్యం కాదని ఒప్పుకోక తప్పదు.

 

విజయమ్మ చెప్పినట్లు ఆయన ఏనాడు ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టకపోయినా, ఎన్నడూ ఎవరినీ కలువకపోయినా, ఎవరికీ క్విడ్ ప్రో చేయమని ఆదేశాలు ఇవ్వకపోయినా, సీబీఐ, కోర్టులు, మీడియా, రాజకీయ పార్టీలు అన్నీ ఆయన ఉన్నతిని చూసి ఓర్వలేక కళ్ళలో నిప్పులు పోసుకొని అన్యాయంగా జైలు పాలు చేసాయని మనందరికీ తెలుసు.అయినప్పటికీ, ఆయన విశాల హృదయంతో లోపలున్నవాళ్ళకే కాకుండా, బయట ఉండిపోయిన మరి కొంతమంది మంత్రులకు కూడా జైల్లో ట్రీట్ ఇచ్చేందుకు సిద్దంగానే ఉన్నారు. కానీ, ఆ ట్రీట్ స్వీకరించడానికి మొహమాటపడుతూ కొందరు మంత్రులు, అధికారులు అనవసర భేషజాలకి పోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారందరూ కూడా పాత సినిమాలలో క్లయిమాక్స్ సీనులో కుటుంబ సభ్యులందరూ విలన్ డెన్ దగ్గిర కలుసుకొన్నట్లు, ఈ రోజు సీబీఐ కోర్టు వద్ద కలుసుకోబోతున్నారు. వారిలో మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వంటి ప్రముఖులున్నారు. ఇంత కాలం ఆయనతో నేరుగా మాట్లాడే భాగ్యానికి నోచుకోకపోయినా, ఎవరి కంటికీ ఆయన కనిపించకపోయినా వారందరి తల రాతలు ఇంత గొప్పగా తీర్చిదిద్దిన ఆ జగన్నాటక సూత్రధారి జగన్ మోహన్ రెడ్డిని వారు ఈ రోజు ప్రత్యక్షంగా కనులారా దర్శించుకోబోతున్నారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీలు వగైరా వచ్చిపడిన తరువాత అటువంటి గొప్ప వ్యక్తుల నిజరూప దర్శనం బొత్తిగా కరువయిపోయిందని బాధపడే జనాలకి ఊరట కలిగించడానికే, కోర్టు కూడా అప్పుడప్పుడు ఇటువంటి ప్రత్యేకదర్శనం ఏర్పాట్లు చేస్తుందేమో మరి తెలియదు. సీబీఐ వారందరిపై నమోదు చేసిన 5వ చార్జ్ షీటును ఈరోజు సీబీఐ కోర్టు విచారణకి స్వీకరిస్తున్నందున వారందరికీ సపరివార సమన్లు జారీ చేసి కోర్టుకి ఆహ్వానించింది.

 

దాదాపు ఆరు నెలలుగా బయట ప్రపంచాన్ని లోపలే ఉండి నడిపిస్తున్నఆ జగన్నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ రోజు జైలు బయట కాలుపెట్టబోతున్నాడు కనుక, ఆయన నిజరూప దర్శనం కోసం భారీగా జనాలు తరలివస్తున్నందున పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

 

తాజా వార్తా: ఆయన, ఆయన అనుచరులు అందరూ తిరిగి తమ గూటికి (చంచల్ గూడా జైలుకి) ఇప్పుడే చేరుకొన్నారు. వారందరికీ కోర్టు ఈ నెల 21వరకు రిమాండ్ విదించింది.