నిరంతరం పోరాడుతున్నా ప్రజాధారణ దక్కడం లేదు!
posted on Oct 28, 2015 11:54AM
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిత్యం ఏదో ఒక సమస్యపై ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటారు. సాధారణ సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు చేయనవసరం లేదు కానీ పంట రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యలు, రాజధాని తదితర ప్రాజెక్టుల కోసం భూసేకరణ, ప్రత్యేక హోదా వంటి అంశాల మీద ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగించగలిగి ఉండి ఉంటే, జగన్ చెప్పుకొంటున్న విశ్వసనీయత, మడమ తిప్పని పోరాటం వంటి మాటలకు అర్ధం ఉండేవి. తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయడం కోసం చేసిన పోరాటంతో తెరాస ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అయితే ఇంతవరకు జగన్ చేసిన ఏ ఒక్క పోరాటం కూడా ఇలాగ విజయవంతం కాలేదు. ఎందుకంటే ఏ సమస్యపై నిలకడగా పోరాటం చేయకపోవడమే కారణమని చెప్పవచ్చును. ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత అకస్మాత్తుగా పోరాటం మొదలుపెట్టారో అంతే అకస్మాత్తుగా దానిని పక్కనబెట్టడం గమనిస్తే అది అర్ధమవుతుంది.
ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో ఆయనతో కలిసి పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడి అమరావతికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యేక పోరాటం కొనసాగించేందుకు చాలా మంచి అవకాశం లభించింది. ఇంత సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకో తన ప్రత్యేక పోరాటాలని అర్ధాంతరంగా నిలిపివేశారు. అందుకు కారణాలేమిటో ఇదమిద్దంగా తెలియదు. బహుశః ప్రత్యేక హోదా కోసం చేప్పట్టిన నిరవధిక నిరాహార దీక్ష అత్యంత అవమానకర పరిస్థితుల్లో ముగించవలసి రావడం, దానికి ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన కొరవడటం వంటి కారణాలు జగన్మోహన్ రెడ్డిని తీవ్ర నిరుత్సాహపరిచి ఉండవచ్చును. అందుకే ఆయన దృష్టి మళ్ళీ రాజధాని భూసేకరణపైకి మళ్లినట్లుంది.
రెండు రోజుల క్రితం జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటించి భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు న్యాయపోరాటం చేయదలిస్తే వారికి వైకాపా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చివచ్చేరు. ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పారు. భూసేకరణకు వ్యతిరేకిస్తూ రెండు రోజులు ధర్నా కూడా చేసారు. కానీ ఆ తరువాత వారి సమస్యని పక్కన పెట్టి ప్రత్యేక హోదా అంశం భుజానికెత్తుకొన్నారు. మళ్ళీ దానిని పక్కన పడేసి రాజధాని భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాటం అంటున్నారిప్పుడు. ప్రత్యేక హోదా వచ్చేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పిన వైకాపా నేతలు, మోడీ వచ్చే వరకు కొంచెం హడావుడి చేశారు. ఆ తరువాత వాళ్ళు కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం తగ్గించి, రాజధాని భూసేకరణ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఈ అంశంపై వైకాపా నేతలు ఎన్ని రోజులు పోరాడుతారో.. ఆ తరువాత మళ్ళీ ఏ అంశాన్ని భుజానికెత్తుకొంటారో వారికే తెలియాలి.
జగన్మోహన్ రెడ్డి నిరంతరంగా చేస్తున్న ఈ పోరాటాల వలన నిజానికి ఆయనకి, వైకాపాకి ప్రజలలో చాలా మంచి ఆదరణ లభించి ఉండాలి కానీ వాటి వలననే ఆయన విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతోంది. నిలకడ లేకపోవడం, చేసే పనిలో చిత్తశుద్ధి లోపించడం, హడావుడిగా నిర్ణయాలు తీసుకొని దుందుడుకుగా వ్యవహరించడం వంటి లోపాలు వైకాపాకు విశ్వసనీయతకు ప్రశ్నార్ధకంగా మార్చుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.