పవన్ జగన్ కలిస్తే.. బాబు గెలుపే.!!

 

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాజీ ఎంపీ సబ్బం హరి తన అభిప్రాయాలు వ్యక్తం చేసారు.. గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు తన వల్లే గెలిచారని పవన్ మాట్లాడినందుకే, పవన్ పై ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు.. 1983 నుంచి 2014 వరకు అశోక్ గజపతిరాజు గెలుస్తూ వస్తున్నారు.. అప్పుడు కూడా అశోక్ గజపతిరాజును పవనే గెలిపించారా? అని సబ్బం ప్రశ్నించారు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీని బతికించడం కోసమే వైసీపీ, జనసేన పార్టీలు కలుస్తాయని అభిప్రాయపడ్డారు.. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు..

బీజేపీ చెప్పినట్టు ఈ రెండు పార్టీలు చేస్తాయనడానికి గత నెలరోజులుగా ఈ పార్టీల నేతలు చేస్తున్న ప్రసంగాలే నిదర్శనమని విమర్శించారు.. 'వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్, పవన్ మాకు మద్దతిస్తానని చెప్పాడని ప్రకటన చేసారు కదా' అని సబ్బం గుర్తు చేసారు.. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిన కారణంగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తర్వాత.. ఏపీ ప్రజల్లో బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. అదే సమయంలో వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీని వ్యతిరేకించకపోవడాన్ని ఏపీ ప్రజలు స్పష్టంగా గమనించారని అన్నారు.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే..

జగన్, పవన్ కలిసి పనిచేస్తున్నారనే విషయం అందరికీ తెలుసని, రాబోయే రోజుల్లో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేసే వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు.. అలా జరిగినప్పుడు మాత్రమే, చంద్రబాబుని ఎదుర్కోగలరనేది వారి అభిప్రాయమని అన్నారు.. అయితే జగన్, పవన్ కలిసి పోటీ చేస్తే చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడకే, ఖచ్చితంగా టీడీపీయే గెలుస్తుంది.. కానీ వైసీపీ,జనసేన కలిసి పోటీచేస్తే కొత్త వ్యూహాలకు టీడీపీ వెళ్లాల్సిన అవసరముంది.. ఆ వ్యూహాలకు టీడీపీ రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది అని సబ్బం హరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.