పరువు నష్టం కేసులో రాహుల్ కు కోర్టు సమన్లు

పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కి పూణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ పై రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ పూణె కోర్టులో పరువు నష్టం దావా వేశారు. వీర సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాహుల్ కు కొత్త కాదని పలువురు అంటున్నారు. ప్రతి సందర్భంలోనూ సావర్కర్‌ను అవమాన పరిచేలా రాహుల్‌ విమర్శలు చేస్తున్నారని సత్యకి ఆరోపించారు. ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్‌కు సమన్లు పంపింది. అక్టోబర్‌ 23న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. పరువు నష్టంపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 500 ప్రకారం ఆయన సమాధానం చెప్పడానికి హాజరుకావాల్సిన అవసరం ఉన్నందన్నారు.