వాళ్ళందరి గుట్టు విప్పుతా...పది రోజులు ఆగండి..


మొత్తానికి ఏపీ రాజకీయాలు మాత్రం రోజుకో ట్విస్ట్ తో.. రోజుకో కొత్త అంశంతో వేడి వేడిగా తయారవుతున్నాయి. ఎవరికి వాళ్లు వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం తెగ కష్టాలు పడుతున్నారు. ఇక ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నారు. తమ వల్లే ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అయితే కేంద్రం మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పేసిందనుకోండి. అయినా భగీరధ ప్రయత్నం చేస్తున్నారు ఏపీ నేతలు. ఇక ఇప్పటికే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందబ్బా అని అయోమయంలో ఉన్న సామాన్య ప్రజలకు...అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇంకా అయోమయంలో పడేస్తుంటారు  హీరో శివాజీ.

 

ఈ మధ్య ఆపరేషన్ గరుడ అంటూ.. దాని గురించి ఏకంగా ఓ బ్లాక్ బోర్డ్ పెట్టి.. ఆ ఆపరేషన్ గురించి చెప్పి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత రెండు మూడు రోజులు దానిపై చర్చలు జరిగినా..తరువాత దాని గురించి మరిచిపోయారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రత్యేక హోదా’ సాధించే ఉద్దేశం రాజకీయ నేతలకు గానీ, రాజకీయ పార్టీలకు గానీ లేదని, వాళ్ళందరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారని, ఎవరికీ ప్రత్యేక హోదా సాధించే చిత్తశుద్ధి లేదని అంటున్నారు. అంతేకాదు... కొందరు నేతలైతే రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించేందుకు డబ్బులు కూడా తీసుకున్నారని, వాళ్ళందరి గుట్టు విప్పుతానని మండిపడ్డారు. మరో పది రోజుల్లో అందరినీ నడిరోడ్డుపై నిలబెట్టి జనాలు రాళ్ళు వేసి కొట్టేలా చేస్తానని చెప్పిన శివాజీ, తనకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ‘స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్, పోలవరం’ వంటి కీలకమైన అంశాల కోసం రాజకీయ నాయకులే పోరాటానికి దిగని సందర్భంలో... సినీ హీరోలను ఎలా విమర్శిస్తామని శివాజీ లాజికల్ గా ప్రసంగించారు. మరి  శివాజీ ఏం గుట్టు విప్పుతారో... ఎవరిపై ఏం బాంబు పేల్చుతారో తెలియాలంటే అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.