సమావేశాల్లో కనిపించని హరీష్ రావు.. ఆర్ధిక మంత్రి లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ శాఖపై రివ్యూ చేస్తారో.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించటం కూడా కష్టంగా మారింది. మెరుపులు లేకుండానే పిడుగుల్లాంటి నిర్ణయాలను గతంలో ఎన్నో ఆయన ప్రకటించారు. ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంబంధిత శాఖల మంత్రులు తప్పకుండా ఉంటారు. కానీ తెలంగాణ రాజకీయంలో ఆర్ధిక శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం ఆ మంత్రి ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సీఎం ఈ శాఖపై సమీక్ష జరిగేటప్పుడు యాదృచ్చికమో మరేమిటో కాని ఆ శాఖ మంత్రి మాత్రం ఉండటం లేదు. గతంలో ఈటెల రాజేందర్ ఆర్ధిక మంత్రిగా ఉన్నపుడు కూడా ఇలానే జరిగింది. బడ్జెట్ పై రివ్యూలు జరిగినా.. ఆర్థిక పరిస్థితి పై సమీక్ష జరిగినా ఆయన ఉండకపోయేవాడు. కొన్నిసార్లు శాఖకు సంబంధించిన మంత్రికి నిర్ణయాలను చెప్పే వారు కాదని ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఆర్థిక శాఖకు కొత్త మంత్రి వచ్చారు. సీఎం కేసీఆర్ ఫైనాన్స్ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అంతేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆర్థిక శాఖపై సీఎం కీలక సమీక్ష నిర్వహించారు. కేంద్ర విధానాలను విమర్శించారు.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు.. ఇవన్నీ కూడా హరీశ్ రావు లేకుండానే జరిగాయి. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో సీఎం సమావేశమై వారికి వరాల జల్లు కురిపించినప్పుడు కూడా హరీశ్ లేరు. ఇక ఆర్థిక శాఖను ఎవరు నిర్వహించినా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనక తప్పదేమో అనేలా ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ చర్చ ఆర్థిక శాఖలోనూ, సెక్రటేరియట్ లోను జోరుగానే నడుస్తోంది. మరి ఆర్ధికశాఖ రివ్యూలకు ఆ శాఖ మంత్రి హాజరు కాకుండా ఉండటం కొనసాగుతుందో.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.