అంతర్జాతీయంగా ఏపీ పరువు గంగపాలు!!

తాము అందించిన సేవలకు డబ్బులు చెల్లించకుండా ఏపీ ప్రభుత్వం ముఖం చాటేస్తోందంటూ విదేశీ కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. తమ బకాయిలు రాబట్టాలి అంటూ జర్మనీకి చెందిన రెండు ప్రతిష్టాత్మక కంపెనీలు ఆ దేశ రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించాయి. ఢిల్లీలో పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కార్యాలయానికి వెళ్లిన జర్మనీ రాయబారి ఏపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన అత్యంత సాంకేతిక నైపుణ్యంతో కూడిన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు దక్కే గౌరవం ఇదేనా అని కేంద్రాన్ని నిలదీశారు. దీంతో ఏపీ ప్రభుత్వం తీరుపై కేంద్రం మండిపడింది. అంతర్జాతీయ కంపెనీల సేవలు వినియోగించుకుంటున్నప్పుడు దేశ పరువు, ప్రతిష్టలకు విఘాతం కలగకుండా చూడాల్సింది పోయి ఇలా ప్రవర్తిస్తే ఎలాగంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కంపెనీలకు తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశిస్తూ లేఖలు రాసింది. 

పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా దాదాపు 150 మీటర్ల లోతులో డయాఫ్రం వాల్ నిర్మించటానికి ప్రపంచంలో మూడు కంపెనీలకే సామర్థ్యం ఉందని జల వనరుల శాఖ ఇంజనీర్ లు గుర్తించారు. వాటిలో జర్మనీకి చెందిన బావర్ కంపెనీ ముందంజలో ఉందని తేల్చారు. ఇదే విషయాన్ని అప్పటి ప్రధాన కాంట్రాక్టు సంస్థ  ట్రాన్స్‌స్ట్రాయ్‌ కు వెల్లడించి, ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. దీంతో బావర్ కంపెనీ ఎల్ అండ్ టీ తో ఒప్పందం చేసుకున్నారు. డయాఫ్రం వాల్ ను నిర్మించేందుకు అవి  ట్రాన్స్‌స్ట్రాయ్‌ తో సబ్ కాంట్రాక్టు చేసుకున్నాయి. ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం  ట్రాన్స్‌స్ట్రాయ్‌ కు బిల్లుల చెల్లిస్తుంటే అవి సకాలంలో బావర్ కు చేరడం లేదు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే పనులు నిలిపి వేస్తామని ఆ కంపెనీ హెచ్చరించింది. దీంతో జల వనరుల శాఖ ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్ లు తెరిచి నేరుగా సబ్ కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు జరిపేలా ఒప్పందం చేసుకున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి 422 కోట్ల అంచనా వ్యయంతో ఒప్పందం చేసుకున్నారు. బావర్ సంస్థ సకాలంలోనే పనులు పూర్తి చేసినా ఇంకా 91.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. 

దీనిపై కంపెనీ ప్రతి నిధులు పలుమార్లు జలవనరుల శాఖకు వినతిపత్రాలిచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి చెల్లింపులపై వారికి ఎలాంటి హామీ లభించలేదు, పైగా పాత కాంట్రాక్టు సంస్థలు అధిక మొత్తాలకు పనులు చేపట్టాయని, అందులో అవినీతి జరిగిందంటూ దర్యాప్తు కోసం కమిటీలు వేయడంతో ఆందోళనకు గురైన బావర్ యాజమాన్యం ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదంటూ జర్మనీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి సమాచారం అందడంతో ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది. పోలవరం ప్రాజెక్టులో బావర్ కంపెనీ చేపట్టిన పనులకు డబ్బులు ఇవ్వడం లేదంటూ గతేడాది అక్టోబర్ లో డీపీఐఐటి సంయుక్త కార్యదర్శి రాజేంద్ర రత్నకు జర్మనీ రాయబారి ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డిపిఐఐటి బావర్ కంపెనీకి బకాయి పడిన 91.10 కోట్లు వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఢిల్లీ లోని ఏపీ భవన్ ప్రత్యేక రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ కు లేఖలు రాసింది. దీనిపై స్పందన లేకపోవటంతో ఈ నెల 7న గత అంశాలను గుర్తు చేస్తూ బావర్ కంపెనీకి తక్షణమే బిల్లుల చెల్లించాలంటూ మళ్లీ లేఖ రాశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధుల కొరతను సాకుగా చూపుతోంది, బావర్ కంపెనీకి  ట్రాన్స్‌స్ట్రాయ్‌ ఎందుకు చెల్లించలేదో తమకు తెలియదంటోంది. బావర్ ట్రాన్స్ ట్రాయ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగి ఎస్క్రో అకౌంట్ ఏర్పడిన విషయంపై మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు రీయింబర్స్ చేస్తే  ట్రాన్స్‌స్ట్రాయ్‌ కు చెల్లించాల్సిన మొత్తం నుంచి 91.10 కోట్లు ఇస్తామని జల వనరుల శాఖ చెబుతోంది. రీయంబర్స్ చేసిన పదిహేడు వందల ఎనభై కోట్ల నుంచి ఎందుకు చెల్లించలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు.