మంత్రి గల్లా అరుణకుమారి కొడుకుకి తెదేపా టికెట్

 

సాదారణంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ పుత్రరత్నాలకు తమ పార్టీ టికెట్స్ ఇప్పించుకొని వారు రాజకీయాలలో స్థిరపడిన తరువాత రిటర్మెంట్ తీసుకోవాలని ఆశిస్తారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలులు వీస్తుండటంతో వారే కాదు, వారి పుత్రరత్నాలకు కూడా తెదేపా, వైకాపాలలో టికెట్స్ కోసం మాట్లాడుకొంటున్నారు.

 

కాంగ్రెస్ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు మరియు సినీ నటుడు కృష్ణకి అల్లుడు అయిన గల్లా జయదేవ్ తెదేపా తీర్ధం పుచ్చుకోనేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనది చిత్తూరు జిల్లా అయినప్పటికీ, అత్తవారిది గుంటూరు కావడంతో అక్కడి నుండే లోక్ సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. చంద్రబాబు ఆయనకు టికెట్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి కొడుకు పచ్చ కండువా కప్పుకొంటే, మంత్రిగారు కాంగ్రెస్ కండువా కప్పుకొని కొడుకు పార్టీని తిట్టడం కష్టం గనుక మరి ఆమె కూడా తెదేపాలోకి జంపయిపోతారేమో చూడాలి. ఇక బావగారి కోసం మహేష్ బాబు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది గనుక, జయదేవ్ కి టికెట్ ఖాయం చేయడం వల్ల తేదేపాకు లాభమే తప్ప నష్టమేమి ఉండకపోవచ్చును.

 

జయదేవ్ తో బాటు సినీ నటుడు కృష్ణ సోదరుడు మరియు సినీ నిర్మాత అయిన జీ.ఆదిశేషగిరి రావు తెనాలి నుండి తెదేపా టికెట్ పై శాసనసభకు పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రస్తుతం తెనాలికి ప్రాతినిద్యం వహిస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గుంటూరు (పశ్చిమం) నుండి పోటీ చేయవలసిందిగా చంద్రబాబు కోరినప్పటికీ, ఆయన తన నియోజక వర్గం వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

 

ఇక కాంగ్రెస్ యంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు నుండి లోక్ సభకు టికెట్ ఇచ్చినట్లయితే తెదేపా సైకిల్ ఎక్కేందుకు సిద్దంగా ఉన్నారు.