కేసీఆర్ సీటుకే టార్గెట్... గజ్వేల్ లో బీజేపీకి గట్టి అభ్యర్తి దొరికేసినట్లే!!

 

తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్.. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. ఇప్పుడు ఈ గడ్డ గులాబీ అడ్డాగా మారింది. గజ్వేల్ లో తిరుగులేని మెజారిటీతో కేసీఆర్ రెండు సార్లు గెలిచారు. గజ్వేల్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల తరువాత టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ బాధ్యతలను నర్సారెడ్డి చూస్తున్నారు. ఆయనకి వల వేయాలనే ప్లాన్ లో బిజెపి ఉన్నట్లు తెలుస్తుంది. 

నర్సారెడ్డి గతంలో కాంగ్రెస్ లో ఉండేవారు. 2009 లో గజ్వేల్ నుంచి గెలిచారు. ఆ తర్వాత సిద్దిపేట నుంచి కేసీఆర్ గజ్వేల్ కి మారడంతో.. టీఆర్ఎస్ లో చేరి కీలక నేతగా నియోజకవర్గంలో పనిచేసారు. 2019 ఎన్నికల ముందు పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గులాబీకి గుడ్ బై చెప్పి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు నర్సారెడ్డి. అప్పటి నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. గజ్వేల్ లో గత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. మహిళా నేత ఆకుల విజయ అభ్యర్థిగా నిలిచారు. కానీ చెప్పుకోదగ్గ ఓట్లు సంపాదించలేదు. తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బిజెపి సిఎం నియోజకవర్గంపై కన్నేసింది. ఇక్కడ బలమైన అభ్యర్థి కోసం చాలా రోజులుగా వెతుకుతుంది. ఇందులో భాగంగా ఇపుడు నరసారెడ్డికి గాలం వేయాలన్నది కమలనాథుల ప్లాన్. ఆయనని పార్టీ లోకి లాగాలని చర్చలు జరుపుతున్నారు. అయితే డిసెంబర్ లో కొత్త నాయకత్వం వచ్చిన తరువాత ఈయన చేరిక ఫైనల్ అవుతుందని బీజేపీ వర్గాలలో గుసగుస వినిపిస్తోంది.