భయాలను ప్రభావితం చేసే స్నేహితులు

 


అభంశుభం ఎరుగని పసిమనసు ఓ తెల్ల కాగితంలాగా ఉంటుంది. దాని మీద ఎవరు ఎలాంటి ముద్ర వేసినా అది జీవితకాలం ఉండిపోతుంది. అయితే ఇంతవరకూ జన్మతః వచ్చిన జన్యువులో లేకపోతే తల్లిదండ్రుల ప్రభావమో పిల్లల భయాందోళనలకు కారణాలు అనుకునేవారు. కానీ చిన్ననాటి స్నేహితులు కూడా మనలోని భయాల తీరుని ప్రభావితం చేస్తారంటూ ఓ పరిశోధన వెలువడింది.

 

బాల్యం భయాలమయం :

బాల్యంలో ఉండేవారిని లెక్కలేనన్ని భయాలు చుట్టుముడుతూ ఉంటాయి. వారు కొత్త జంతువుని చూసినా భయపడతారు, కొత్త శబ్దాన్ని విన్నా భయపడతారు... ఏమీ కనిపించని చీకటన్నా భయపడుతుంటారు. క్రమేపీ ఒంట్లో బలం, మనసులో స్థైర్యం, పరిసరాల పట్ల అవగాహన ఏర్పడేకొద్దీ ఈ భయాలు చెదిరిపోతుంటాయి. మరికొందరిలో మాత్రం ఇవి జీవితాంతం ఉండిపోయి, వారి బతుకుని చిన్నాభిన్నం చేసి పారేస్తాయి.

 

స్నేహితులూ కారణమే :

పిల్లలలో మెదిలే భయాలను వారి స్నేహితులు కూడా ప్రభావితం చేస్తారనే కొత్త అంశం ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు ఇంగ్లండుకి చెందిన కొందరు నిపుణులు ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. దీనికోసం వారు 242 మంది పిల్లలను ఎంచుకున్నారు. వీరంతా కూడా 7 నుంచి 10 ఏళ్ల లోపువారే. వీరందరికీ కూడా గతంలో ఎప్పుడూ చూడని ఓ రెండు జంతువుల చిత్రాలను చూపించారు. సగం మంది పిల్లలకి ఈ కొత్త జంతువుల గురించి మంచిగా చెబితే, మరికొందరికి వీటి గురించి భయం కలిగించే వివరాలను అందించారు.

 

భావాలు బదిలీ అయ్యాయి :

ప్రయోగంలో రెండోదశలో భాగంగా పిల్లలందరినీ ఇద్దరిద్దరుగా జతచేశారు. కాసేపటి తరువాత వారిని మళ్లీ పరీక్షించారు. కొత్త జంతువు గురించి భయపడుతున్న పిల్లలు, తోటివారిలో కూడా తమ భయాన్ని చొప్పించినట్లు తేలింది. ఆ జంతువు పట్ల భయాన్నీ, ఆ భయాన్ని ఎదుర్కొనేందుకు ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్నీ కూడా వీరు ఇతరులకు బదలాయించేశారు.

 

ఇదీ ఉపయోగం :

పైకి సాధారణంగా కనిపించే ఈ పరిశోధన మనలోని అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపవచ్చునంటున్నారు నిపుణులు. తీవ్రమైన భయాందోళనలతో బాధపడుతున్న పిల్లలు, ధైర్యంగా మెలిగే పిల్లలతో స్నేహం చేస్తే... వారిలోని భయాందోళనలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. విపరీతమైన భయాలతో బాధపడుతున్న పిల్లలకు చికిత్సను అందిస్తున్నప్పుడు, వారిలో అలాంటి భయాలను ప్రోత్సహిస్తున్న మిత్రులు ఎవరన్నా ఉన్నారేమో గమనించుకోవాలి అని కూడా సూచిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- పిల్లలలో అనవసరమైన భయాలను నివారించాలన్నా, పరిమితి దాటిన ఆందోళనకు చికిత్సను అందించాలన్నా... వారి స్నేహితులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. బహుశా ఇది పెద్దలకు కూడా వర్తిస్తుందేమో!

 

- నిర్జర.