లంచం తీసుకుని కూడా పని చేయని అధికారులు...ఎమ్మార్వో ఆఫీస్ లోనే రైతు ఆత్మహత్య

 

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఒక రైతు ప్రాణం బలయ్యింది. అది కూడా ఆ రెవెన్యూ కార్యాలయం ఎదుటే. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వినోద రాయుడు పాలెంలోని రత్తయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నాగులుప్పలపాడు మండలం ఎమ్మార్వో ఆఫీసు వద్దే పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడు. నాలుగేళ్లుగా వెంటాడుతున్న వర్షాభావ పరిస్థితులతో పంటలు సరిగా పండలేదు.

దీంతో ఆ రైతు అప్పులపాలవ్వడంతో పొలం అమ్మి వాటిని తీర్చాలనుకున్నాడు. కానీ రెవెన్యూ అధికారుల చేతివాటమో లేక నిర్లక్ష్యమో కానీ ఆ భూమి మరొకరి పేరుతో ఆన్‌లైన్‌ అయి ఉంది. దీన్ని మార్చాలని కాళ్లరిగేలా తిరిగినా అధికారుల నుంచి స్పందన కరువైంది. దీంతో తనకు ఉన్న ఇంటిని తాకట్టు పెట్టాడు. ఎలాగైనా తన భూమిని అమ్మి దాన్ని తీర్చాలని భావించిన ఆయన మళ్లీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారు పట్టించుకోకపోవడంతో తీవ్ర మానసికక్షోభకు గురైన ఆయన తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో గంటల తరబడి అక్కడే మృత్యువుతో పోరాడి మరణించాడు. సోమవారం రాత్రి మరణించిన రత్తయ్యను మంగళవారం మధ్యాహ్నం వరకు ఎవరూ గుర్తించలేదు. అతడు నిద్రిస్తున్నాడేమో అనుకుని ఎవరి పనుల్లో వాళ్లున్నారు. మధ్యాహ్నానికి ఎండ పడినా కూడా అతడు లేవకపోవడంతో అనుమానం వచ్చి అధికారులకు, పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు చేరుకుని ఆయన చనిపోయినట్టు తేల్చారు. అన్నట్టు ఆ పొలం ఆన్ లైన్ చేయడనికి తమ గ్రామ వీఆర్వోకి లంచం కూడా ఇచ్చాడట ఆయన.