టీడీపీ బీసీ ఓటు బ్యాంకుకు జగన్ బీటలు

స్కూలు పిల్లలకు మతం-కులం లేదు

 

పాఠశాలలో కుల-మత నమోదుకు పాతర

 

139 కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు

 

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మొండితనానికి, గుండెధైర్యానికి నిలువెత్తు చిరునామా. ఆయనొక సంచలనం. విజయమయినా, వివాదమయినా ఆయన దారే వేరు. ఏదయినా అనుకున్నారంటే చేసేయడమే. జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు.. జనరంజకమన్న ప్రశంసలు, మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తుంటే.. ప్రజావ్యతిరేకమని ఇంకొన్ని వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తుంటాయి. న్యాయవ్యవస్థతో పోరాటానికి తెరలేపిన జగన్.. ఆయనను అభిమానించే వారి దృష్టిలో మాత్రమే కాకుండా, న్యాయవ్యవస్థ లోపాలపై అసంతృప్తితో ఉన్న అనేకమంది దృష్టిలో.. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకుంటున్నారు. మరికొన్ని వర్గాలు మాత్రం సహజంగానే జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. ఇన్ని వైరుధ్యాలు ఉన్నందుకే, దేశం ఇప్పుడు  జగన్మోహన్‌రెడ్డిని ఆసక్తిగా చూస్తోంది. అది సానుకూల కోణమా? వ్యతిరేక కోణమా అన్నది వేరే విషయం!

 

ఇన్ని సంచలనాలకు కేంద్ర బిందువయిన జగన్మోహన్‌రెడ్డి.. తాజాగా తీసుకున్న రెండు విప్లవాత్మక నిర్ణయాలు, జనం దృష్టిలో ఆయనను హీరోను చేశాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు, రిజిస్టర్‌లో కులం-మతం ప్రస్తావన ఉండకూడదన్న నిర్ణయం... మెజారిటీ ప్రజలనే కాదు, విద్యావంతులు, సమాజహితం కోరుకునే వారిని సైతం మెప్పిస్తోంది. ఇప్పటివరకూ స్కూలు దశ నుంచే కుల-మత భావనలు మొదలయ్యేవి. విద్యార్ధి కులం-మతాన్ని విధిగా ప్రస్తావించాల్సి వచ్చేది. జగన్ సర్కారు తాజాగా ఈ నిబంధనకు పాతరేసింది. రిజిస్టరులో విద్యార్ధి కులం-మతాన్ని పేర్కొనకూడదని ఆదేశించింది.  

 

ఈ నిర్ణయం వల్ల.. పాఠశాల స్థాయి నుంచే మొదలవుతున్న, కుల-మత భావనకు పాతర వేయవచ్చన్న అభిప్రాయం మేధావి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆంధ్రాలో ఇప్పటికే కులభావన తీవ్రస్థాయి నుంచి, ఉన్మాద దశకు చేరుకుంది. విజయవాడ న గరం పరిసర ప్రాంతాల్లో, ఏడాది పాటు ఉండి వచ్చిన ఎవరికయినా.. కుల వ్యవస్థపైనే అసహ్యం పుట్టడం ఖాయం. ఇప్పటికీ అక్కడ కులాల వారీగా ఫంక్షన్లు, స్నేహాలతోపాటు.. కుల ఘర్షణలూ జరుగుతున్న అరాచక సంప్రదాయం కనిపిస్తోంది. వాహనాలపై తమ కులాలను సగర్వంగా ప్రకటించుకునే సంస్కృతి దేశంలో ఒక్క బెజవాడలోనే కనిపిస్తుంటుంది. ఫలానా కులం వారికే ఇల్లు అద్దెకు ఇస్తామన్న దిక్కుమాలిన కులతత్వం దర్శనమిస్తుంటుంది.

 

నిజానికి ఇలాంటి కుల భావన ప్రారంభం కావడానికి.. పాఠ శాల స్థాయి నుంచి ప్రభుత్వమే, కుల ప్రస్తావన తీసురావడమే కారణం. అందుకే ఆ విధానాన్ని తొలగించాలని గతంలో వామపక్ష ప్రముఖులు, సంఘాలు డిమాండ్ చేసేవి. అయినా ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు జగన్ ఆ మార్పు తీసుకురావడాన్ని సాహసోపేత నిర్ణయంగానే భావిస్తున్నారు.

 

ఇక 139 కులాలకు 56 కార్పొరేషన్లు  ఏర్పాటు చేయడం కూడా, సాహసోపేత నిర్ణయంగానే భావిస్తున్నారు. గత ఎన్నికల ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా, 28 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అయితే, వాటిని ఎన్నికల నోటిఫికేషన్ నెల-రెండు నెలల ముందు ఏర్పాటు చేయడంతో, అవి కార్యాచరణకు నోచుకోలేకపోయాయి. ఎన్నికల కోడ్ కారణంగా,  చివరకు చాలామంది పదవీ బాధ్యతలు కూడా తీసుకోలేకపోయారు. మరికొందరు మాకొద్దని రాజీనామా చేశారు. ఇప్పుడు జగన్ ఏకంగా... 139 కులాలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేసి, బడుగుల పెదవులపై చిరునవ్వులు పూయించారు. చంద్రబాబులా ఎన్నికల ముందు కాకుండా.. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల ముందు ఏర్పాటుచేయడంతో, అది జగన్ చిత్తశుద్ధిని చాటినట్టయింది.

 

సహజంగా అరడజను కార్పోరేషన్లు.. అవి కూడా విడతల వారీగా ఏర్పాటుచేసే సంప్రదాయం ఉంది. ఆ సందర్భంగా ఆయా కులాల వారీతో సన్మానాలు చేయించుకోవడం, మళ్లీ కొంత గడువు తర్వాత మరికొన్ని కార్పొరేషన్లు ఏర్పాటుచేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా.. 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేయడమంటే, అది అసాధారణ అంశమే కాదు. సాహసోపేతం కూడా! ఎందుకంటే వీటి పాలకవర్గాల్లో సగం మంది మహిళలకు కేటాయించడం అభినందనీయమే. ఇందులో ఉప కులాలకూ స్థానం కల్పిస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. ఇప్పటివరకూ దాదాపు అన్ని ప్రభుత్వాలూ యాదవ, శెట్టిబలిజ, తూర్పు కాపు వంటి ప్రధాన బీసీ కులాలకే అన్నింటా ప్రాధాన్యం ఇచ్చేవి. అసలు ఉప కులాల గురించి పట్టించుకున్న పాలకులెవరూ ఇప్పటిదాకా కనిపించలేదు. ఇప్పుడు ఆ లోటును కూడా జగన్మోహన్‌రెడ్డి సర్కారు భర్తీ చేసినట్టయింది. గత 16 నెలల కాలంలో.. 2,71,37,253 మంది బీసీలకు, 33,500 కోట్ల లబ్థి చేకూర్చినట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

కాగా జగన్మోహన్‌రెడ్డి...  బడుగులకు సంబంధించి తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం, టీడీపీ బీసీ ఓటు బ్యాంకుపై ‘పిడుగుపాటు’గానే కనిపిస్తోంది. బీసీల పార్టీగా పేరున్న టీడీపీ.. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న కాలంలో,  తన బీసీ మూల సిద్ధాంతాన్ని విస్మరించింది. కాపుల ఓట్ల కోసం, పార్టీకి సంప్రదాయ మద్దతుదారైన బడుగులను పక్కకుపెట్టింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు-బీసీలకు శత్రుత్వం ఉందని తెలిసినా.. కాపులు ముద్రగడ వైపే ఉన్నారని తెలిసినా, పార్టీలోని కొందరు కాపు నేతల ఒత్తిళ్లకు లొంగి, కాపులను బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానితో ఆగ్రహించిన బీసీలు టీడీపీకి వ్యతిరేకంగా మారారు. పోనీ అలాగని రిజర్వేషన్ ప్రకటన సాధించిన కాపులేమైనా, టీడీపీకి ఓటు వేశారా అంటే అదీలేదు. కాపులు కూడా వైసీపీకే జైకొట్టడంతో టీడీపీ పరాజయం పాలవ్వాల్సి వచ్చింది.

 

దీనితో దిద్దుబాటుకు దిగిన బాబు.. ఈసారి బలమైన బీసీ వర్గానికి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేపనిలో ఉన్నారు. పోయిన బీసీ ఓటు బ్యాంకును, తిరిగి సాధించే ప్రణాళిక రూపొందిస్తున్న దశలో... జగన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం, టీడీపీ బీసీ ఓటు బ్యాంకును, వైసీపీ కొల్లగొట్టేదిగానే కనిపిస్తోంది. ఎందుకంటే, 10 లక్షల జనాభా ఉన్న కులాలకు ఏ కేటగిరి, లక్ష నుంచి పది లక్షల వరకూ బి, లక్షలోపు జనాభా ఉన్న కులాలను సి కేటగిరిలో చేర్చారు. అంటే ప్రస్తుతం ప్రతీ బీసీకి ఒక కార్పోరేషన్ ఏర్పాటుచేసినట్టయింది.

 

ఇప్పటివరకూ ఇవన్నీ బీసీ కార్పొరేషన్ కిందనే ఉండేవి. జగన్ తాజా నిర్ణయంతో, అన్ని బీసీ కులాలకు సొంత కార్పొరేషన్ సమకూరినందున, సహజంగా ఆయా కులాలలో ఇది, జగన్‌పై సానుకూలత పెంచే అంశంగానే భావించక తప్పదు. అయితే... వీటికి బడ్జెట్, లబ్ధిదారులకు ఇచ్చే రుణాలు, పాలకమండలికి కార్యాలయాలు, వాహనాల ఏర్పాటు వంటి అంశాలపై కూడా ఇంతే దూకుడు ప్రదర్శించకపోతే, కొత్త కార్పోరేషన్ల ఏర్పాటు కంటితుడుపుగానే మిగిలిపోక తప్పదు. 

-మార్తి సుబ్రహ్మణ్యం