హోమ్ క్వారంటైన్ లో ఏపీ బీజేపీ!

అంతన్నారు.. ఇంతన్నారు.. రాష్ట్ర సర్కార్ అంతు తేలుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యమన్నారు. కాని ఇప్పుడు మాత్రం తుస్సుమంటున్నారు. 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ఉనికే..  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. పార్టీ కొత్త బాస్ సోము వీర్రాజు పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ఎక్కడున్నారో పార్టీ నేతలకే తెలియడం లేదట. సోము తీరుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ కేడర్ లో ఆందోళన నెలకొంది. పార్టీ భవిష్యత్ పై కమలం నేతల్లో కలకరం కనిపిస్తోంది.  

 

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చాలా సమస్యలున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జనాలు అల్లాడిపోతున్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. జగన్ సర్కార్ తమను పట్టించుకోవడం లేదని, కనీసా సాయం కూడా చేయడం లేదని వరద బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే  ప్రతిపక్ష పార్టీగా ప్రజలు సమస్యలపై పోరాడాల్సిన బీజేపీ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. బీజేపీ ముఖ్య నేతలెవరు మాట్లాడటం లేదు. వరద బాధితులకు బాసటగా సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం లేదు. కొన్ని రోజులుగా సోము వీర్రాజు ముఖమే కనిపించడం లేదు. బీజేపీ ముఖ్య నేతల తీరుపై జనాలు ఫైరవుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో లేకుండా పోవడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. 

 

సోము వీర్రాజు మొదటి నుంచి వైసీపీకి ఫేవర్ గానే ఉన్నారు. వరదల విషయంలో జగన్ సర్కార్ విఫలమైందని జనాలు ఆరోపిస్తున్నారు. దీంతో వరదలపై మాట్లాడితే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుందనే ఆయన సైలెంట్ గా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీర్రాజుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రమంతా సమస్యల్లో ఉంటే మాట్లాడకపోవడం ఏంటనీ కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారట. కన్నా లక్ష్మినారాయణ పార్టీ చీఫ్ గా ఉండగా... ఆయన అన్ని అంశాలపై వెంటనే స్పందించేవారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేవారు. ప్రజలకు అండగా ప్రభుత్వంపై ఘాటు ప్రకటనలు చేసేవారు. కాని కొన్ని రోజులుగా బీజేపీలో అలాంటి సీన్ కనిపించడం లేదు. దీనిపైనే ఏపీ బీజేపీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కన్నాతో పోలుస్తూ వీర్రాజు తీరుపై చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. 

 

తిరుమల విషయంలోనూ జగన్ సర్కార్ వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీ నిర్ణయాలపై భక్తులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాని హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీ మాత్రం టీటీడీ నిర్ణయాలపై మాట్లాడటం లేదు. టీటీడీ డిక్లరేషన్ విషయంలోనూ సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రమంతా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేసిన పార్టీ చీఫ్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. టీటీడీ వివాదాస్పద నిర్ణయాలపై బీజేపీ అధ్యక్షుడు మాట్లాడకపోవడంపై  హిందూ సంఘాలు విస్మయ వ్యక్తం చేస్తున్నాయి. సోము వీర్రాజు సహా కొత్త కార్యవర్గం తీరు బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది.

 

ఇక బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డి బహిరంగంగానే వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొన్ని రోజులుగా విష్ణువర్దన్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలతో ఆయన బీజేపీ లీడరా.. వైసీపీ నాయకుడో అర్ధం కావడం లేదని కొందరు కమలం నేతలు అసహనం చేస్తున్నారు. అయినా తీరు మార్చుకోని విష్ణువర్దన్ రెడ్డి.. ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకించే సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ను సమర్ధించడం కమలనాధుల్లోనే కలకలం రేపుతోంది. అది కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ జగన్ రాసిన లేఖకు మద్దతుగా ఆయన మాట్లాడటం బీజేపీకి ఇబ్బందిగా మారుతోంది. ప్రధాని మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిత్యం వాదించే, కోర్టుల్లో పిటిషన్లు వేసే న్యాయవాదిని.. వైసీపీ కోసం సమర్ధించడంపై కొందరు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

 

సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిల వైఖరితో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉందా లేక అధికార పార్టీలో కలిసిపోయిందా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ విపక్ష పార్టీగా పని చేస్తోందో లేక వైసీపీకి బీ టీమ్ గా మారిందో తెలియడం లేదని కొందరు కమలం నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి నేతలతో పార్టీ బలోపేతం కావడం కలేనని.. రోజు రోజుకు బలహీన పడి ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుందని మరికొందరు తేల్చి చెబుతున్నారు. కేంద్రంలో అధికారం ఉండటంతో.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ఈజీ. కాని ఏపీ బీజేపీ ముఖ్యనేతలు మాత్రం అధికార పార్టీ మోజుతో పార్టీని నాశనం చేస్తున్నారనే ఆరోపణలు కార్యకర్తల నుంచి వస్తున్నాయి. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిల తీరుతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ హోం క్వారంటైన్ లో ఉందనే చర్చ ఏపీ జనాల్లోనూ జోరుగా సాగుతోంది. మరీ హోం క్వారంటైన్ నుంచి త్వరగా బయటికి వస్తారో లేక వైసీపీ సేవలో తరిస్తూ బీజేపీని బొంద పెడతారో చూడాలని కొందకు బీజేపీ నేతలు కామంట్ చేస్తున్నారు.