రేప్ ఆరోపణల మినిస్టర్ కి బెయిల్ ఇచ్చాడు! సస్పెండ్ అయ్యాడు!

మన దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు? రాజకీయంగా మాట్లాడుకుంటే… ప్రధాని! ఆర్దికంగా మాట్లాడుకుంటే… అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు, బోలెడు మంది! అయితే, బాగా పవర్ వున్న వాళ్లు, డబ్బున్న వాళ్లకు కూడా దక్కని గౌరవం, హోదా, రాజ్యాంగబద్ధమైన రక్షణ వగైరా వగైరా అన్నీ కొన్ని పదవుల్లోని వారికి మాత్రం దక్కుతుంటాయి. రాష్ట్రపతి, గవర్నర్, చట్ట సభల స్పీకర్ … ఇలాంటి వారికన్నమాట! ఇదే కోవలోకి వచ్చే మరో అరుదైన ఉద్యోగం … జడ్జ్!

 

దేశంలో జడ్జ్ పదవిలో వున్న వారికి ఎంతో గౌరవం దక్కుతుంది. మీడియాతో సహా న్యాయమూర్తిని ప్రశ్నించే సాహసం ఎవ్వరూ చేయరు. కాని, రాను రాను మన జడ్జీలు కూడా వివాదాస్పదులవుతన్నారు. సుప్రీమ్ చీఫ్ జస్టిస్ మొదలు సెషన్స్ కోర్టుల్లోని న్యాయమూర్తుల వరకూ చాలా మంది ఎప్పుడో అప్పుడు న్యూస్ లో నిలుస్తున్నారు. తాజాగా హెడ్ లైన్స్ లోకి వచ్చిన జడ్జీగారు… ఓం ప్రకాష్ మిశ్రా. ఈయన లక్నో హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి. కొన్ని రోజుల క్రితం యూపీ మాజీ మంత్రి, రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న గాయత్రి ప్రజాపతికి బెయిల్ ఇచ్చేశాడు. ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ దీలీప్ భోసలే చేత విధుల నుంచీ సస్పెండ్ చేయబడ్డాడు. అంతే కాదు, డిపార్ట్ మెంటల్ విచారణ కూడా ఎదుర్కొంటున్నాడు!

 

సమాజ్ వాది పార్టీలోని పేరు మోసిన క్రిమినల్ అయిన గాయత్రి ప్రజాపతి రేప్ కేసులో నిందితుడు. ఇంకా దారుణం ఏంటంటే, రేప్ బాధితురాలి మైనర్ కూతురు మీద కూడా అత్యాచారం చేయబోయడంటున్నారు. అటువంటి తీవ్ర ఆరోపణలున్న వ్యక్తికి ఓం ప్రకాష్ మిశ్రా ఎలా బెయిల్ ఇచ్చి వుంటాడు? ఆ మధ్య ఇక్కడ కూడా ఓ జడ్జ్ ఇలాగే బుక్కయ్యాడు. గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లాల్సి వచ్చింది!

 

న్యాయం అందించాల్సిన న్యాయమూర్తులే క్రిమినల్స్ కు అండగా నిలిచినట్లు జనంలోకి సంకేతాలు వెళ్లటం చాలా నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే జనం పెద్ద పెద్ద కేసుల్లో బెయిల్ వచ్చినా, తీర్పులు వచ్చినా అనుమానంగా చూస్తున్నారు. అది జగన్ కేసు కావచ్చు, సల్మాన్ కేసు కావచ్చు, జయలలిత అక్రమాస్తుల కేసు కావచ్చు… ఇలా వీవీఐపీ కేసులన్నీ వివాదాస్పదంగానే మారుతున్నాయి. ఇక మామూలు కేసుల విషయంలో అయితే కోర్టుల నిర్ణయాల్ని అడిగేవారూ, నమ్మేవారూ ఇద్దరూ లేకుండా పోతోంది పరిస్థితి! చాలా మంది ఎంత పెద్ద సమస్యైనా కోర్టు బయటే సెటిల్ చేసుకుందామని ఇప్పటికీ భావిస్తుండటం .. నమ్మకం లేకపోవటం వల్ల కూడా జరుగుతోంది!

 

కోర్టులు, న్యాయమూర్తులు వివాదాలకు, అనుమానాలకు తావు లేకుండా వుండాలి. అలా జరిగేందుకు ఏం చేయాలో మేధావులు, ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచించి సంస్కరణలు చేపట్టాలి. బ్రిటీష్ కాలం నాటి మన న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవటం మన బాద్యతే!