మంచివాళ్ళకే కష్టాలన్నీనూ....
posted on Apr 3, 2015 2:02PM
మన రాష్ట్ర రాజకీయ నాయకులలో నీతి నిజాయితీలతో ఎక్కువగా కనెక్ట్ అయ్యుండేవారిలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒకరు. పాపం ఆయన నీతి నిజాయితీలకు కట్టుబడి ఉండాలనుకొన్న కారణంగానే ఎన్నికలలో ఓడిపోయానని తరచూ చెప్పుకొంటుంటారు. అంతమాత్రాన్న ఆయన కవచ కుండలాల వంటి తన నీతి నిజాయితీలను విడిచిపెట్టేయలేదు. అటువంటి వ్యక్తి మీద కాంగ్రెస్ పార్టీ కుట్రపన్ని అన్యాయంగా సీబీఐ కేసులు బనాయించింది. కానీ తన మీద అన్యాయంగా కేసులు బనాయించిన కాంగ్రెస్ అధిష్టానం చలవతోనే ఆయన బెయిలు మీద జైలు నుండి బయటకు రాగలిగారని మీడియాలో అప్పుడెప్పుడో గుప్పుగుప్పున వార్తలు వస్తే ‘నిప్పు లేనిదే పొగ రాదు కదా’ అని ఆయన ప్రత్యర్ధులు కూడా వంత పాడారు.
అయితే చార్జ్ షీట్లు పడినంత మాత్రాన్నఎవరూ దోషి అయిపోరు...బెయిలు దొరికిన వాళ్ళు చట్ట సభలలో న్యాయం ధర్మం ప్రజా సంక్షేమం గురించి మాట్లాడకూడదని ఎక్కడా రూలు లేదు కనుక జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభలో అధికార పార్టీ అవినీతికి పాల్పడుతోందని చాలా కోప్పడిపోయారు. ఆ తరువాత ఆయన శ్రమ అనుకోకుండా డిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రంలో జరిగిపోతున్న అన్యాయాలను, అక్రమాలను ఏకరువు పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఆయన ఇంగ్లీషులో బాగా మాట్లాడగలరు కనుక ఆ నోటితోనే డిల్లీలో ఉండే ఇంగ్లీషు మీడియా వాళ్ళకి కూడా అన్నీ వివరించేరు కూడా.
రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతానని డిల్లీ వెళ్ళిన పెద్దమనిషి పట్టిసీమ ప్రాజెక్టు గురించే ఎక్కువ మాట్లాడారు. అందుకే తెదేపా నేతలు కూడా ఆయన తన సీబీఐ కేసులలో నుండి బయటపడేందుకే పనిగట్టుకొని డిల్లీ వెళ్ళారని ప్రత్యారోపణలు చేసారు. ఆయన డిల్లీ వెళ్ళినంత మాత్రాన్న 'అదే పని మీద' వెళ్ళినట్లేనా? అంటూ రోజమ్మగారు తిరిగి ప్రశ్నించారు. “మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డికి అందరి కాళ్ళు పట్టుకొనే అలవాటు లేదని” ఆమె తేల్చి చెప్పారు.
మరి జగన్ తన కేసుల గురించి మోడీజీతో మాట్లాడేరో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ కూడా అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డిపై నాంపల్లి కోర్టులో మొట్ట మొదటి చార్జ్ షీట్ దాఖలు చేసారు. అదే చేత్తో ఆయనకు చెందిన జగతీ పబ్లికేషన్స్, విజయసాయి రెడ్డిల పేర్లను కూడా ఆ చార్జ్ షీట్లో చేర్చారు. ఏ సంస్థ అయిన లాభాలు ఆర్జిస్తుంటే దానిలో మదుపరులు పెట్టుబడులు పెడుతుంటారు. కానీ జగతీ పబ్లికేషన్స్ (సాక్షి మీడియా) ఇంకా స్థాపించకముందే డెల్లాయిత్స్ ఆడిటింగ్ సంస్థ చేత జగతీ పబ్లికేషన్స్ సంస్థ విలువను రూ. 3050 కోట్లుగా (అధికంగా చేసి) చూపించి, దాని షేర్ విలువను రూ.350గా నిర్ధారించి, వివిధ పారిశ్రామికవేత్తలను జగతీలో పెట్టుబడులు పెట్టించేరని, అందుకు ప్రతిగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా సదరు పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ భూములను మిఠాయిలు పంచిపెట్టినట్లు అప్పనంగా పంచి పెట్టేరని ఈడీ అధికారులు వాదన.
ఏమిటో కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు నీతి నిజాయితీకి కట్టుబడిపోయిన జగన్మోహన్ రెడ్డి మీదనే ఈ ఆరోపణలన్నీనూ. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఏమిటయ్యా అంటే పాపం ఆయన ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్రలు చేయడమే. అందుకే ఆయనకీ కష్టాలన్నీ...అని చెప్పుకొంటారు. నమ్మిన వాళ్ళు నమ్ముతారు లేని వాళ్ళు లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సీబీఐ, ఈడీ అధికారులు మాత్రం ఆయన మాటలను నమ్మకపోవడం ఏమనుకోవాలి? అసలు ఓదార్పుయాత్రలు చేసుకొనే హక్కు కూడా లేకపోతే ఎవరిని మాత్రం ఎవరు ఓదార్చగలరు?
కాంగ్రెస్ పార్టీ కక్ష గట్టి కేసులు బనాయించిందని అని బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఆ కాంగ్రెస్ పోయి ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చినా కష్టాలు తప్పడం లేదేమిటో? మోడీతో కష్టసుఖాలు చెప్పుకొన్న తరువాత కూడా ఈడీ అధికారులు ఈవిధంగా కక్ష కట్టి చార్జ్ షీట్ పెట్టడం చూస్తుంటే ఇక వైకాపాలో తప్ప మరెక్కడా మంచితనానికి, నీతికి నిజాయితీకి స్థానం లేకుండా పోయిందనుకోక తప్పదు.