రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకొంటే కేంద్రానికి కూడా మేలే కదా
posted on Apr 2, 2015 12:09PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత తొమ్మిది నెలలుగా డిల్లీ చుట్టూ చేస్తున్న ప్రదక్షిణాలకు ఫలితం దక్కింది. మార్చి 31న ఆర్ధిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వివిధ పద్దుల క్రింద సోమవారం నుండి బుధవారం వరకు మొత్తం రూ. 8, 375కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమా అయ్యాయి. వాటిలో రెవెన్యూ లోటు పూడ్చేందుకు రూ.1,800 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.1,500 కోట్లు, అమ్మకం పన్ను పరిహారం క్రింద రూ.544 కోట్లు, పుష్కరాల కోసం రూ.100 కోట్లు, వివిధ పద్దుల క్రింద మరో రూ.25-30కోట్లు రాష్ట్ర ఖజానాలో జమా అయ్యాయి. ఇవికాక 13వ మరియు 14వ ఆర్ధిక సంఘాల సిఫార్సుల మేరకు (2014-15; 2015-16 సం.లకి) కేంద్ర పన్నులలో వాటాగా మొత్తం రూ. 3, 080 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమా అయ్యాయి.
ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కేంద్రం నుండి నిధులు రాకపోతే ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా డబ్బు ఏర్పాటు చేసుకొనేందుకు సిద్దపడింది. కానీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లే మార్చి 31వ తేదీ అర్ధరాత్రిలోగా రాష్ట్రానికి భారీగా నిధులు విడుదల చేసింది. నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండటం, కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల చేస్తుండటమనేది ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ఆ కారణంగా తెదేపా, బీజేపీల మధ్య భేదాభిప్రాయాలు కూడా వస్తున్నాయి.
రాష్ట్రానికి సరయిన ఆర్ధికవనరులు ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తన స్వీయ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని హడావుడిగా రాష్ట్ర విభజన చేయడం వలననే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుకి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిక్ష అనుభవిస్తున్నాయి. కానీ ఇప్పుడు జరిగిపోయిన దానిని తలుచుకొని చింతిస్తూ, కాంగెస్ పార్టీని నిందిస్తూ కూర్చోవడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.
కనుక ఈ సమస్యను అధిగమించాలంటే రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగడమే తగిన పరిష్కారం కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రానికి కొన్ని చిన్నా,పెద్ద పరిశ్రమలను రప్పించగలిగారు. మరికొన్ని త్వరలో రాబోతున్నాయి. కానీ ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వలన అనేకమంది పారిశ్రామికవేత్తలు వేచిచూస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే సూచనలేవీ కనిపించకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వమే నూతన పారిశ్రామిక విధానం ప్రకటించి పరిశ్రమలకు భారీ రాయితీలు కల్పించి వారిని కూడా రాష్ట్రానికి రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుచుకొనేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ పరిశ్రమలు స్థాపన జరిగి, వాటి ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరడానికి కనీసం ఒకటి రెండు సం.లు పట్టవచ్చును. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఆధారపడక తప్పదు.
కనుక కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, వీలయినంత త్వరగా ఈ భారాన్ని తగ్గించుకోవడం కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా అది వీలుపడదనుకొంటే అందుకు సరిసమానంగా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించవలసి ఉంటుంది. రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకొనేందుకు కేంద్రప్రభుత్వం అవసరమయిన సహాయ సహకారాలు అందించగలిగితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ సమస్య నుండి త్వరగా బయటపడగలవు. లేకుంటే వచ్చే ఎన్నికల వరకు వాటి మధ్య ఇదే తంతు కొనసాగడం తధ్యం. దాని వలన తెదేపా, బీజేపీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడం తధ్యం. ఆ కారణంగా రెండు పార్టీలు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక దీనిని కేవలం రాష్ట్ర ప్రభుత్వ సమస్యగా మాత్రమే చూడకుండా కేంద్రం కూడా పూర్తి బాధ్యత స్వీకరించవలసి ఉంటుంది.