అప్పుల కోసం ఏపీ తిప్పలు!!

మనిషికైనా, సంస్థకైనా, ప్రభుత్వానికైనా, ఆర్ధికపరమైన క్రమశిక్షణ లేకపోతే ఎదురయ్యే కష్టాలను ఊహించటం కష్టం. ఒక్కసారి కుప్పకూలిపోతే మళ్లీ కోలుకోవడం సాధ్యం కాదు. అందుకే ఏ వ్యక్తి అయినా సంస్థ అయినా ప్రభుత్వమైనా ఆదాయం ఎంత ఖర్చెంత అని లెక్కలేసుకుని ప్రాధాన్యాలకు తగ్గట్లుగా వెళ్తారు. బ్యాంకులు అప్పనంగా ఇచ్చేసాయ్ అని క్రెడిట్ కార్డులు ఓవర్ డ్రాఫ్ట్ లు వాడేస్తే వాడేసినంత కాలం బాగానే వుంటుంది. తిరిగి చెల్లించ లేక దివాలా ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదాయాల గురించి పట్టించుకో కుండా అప్పులు చేసి పొజిషన్ లో ఉంది. ఈ ఏడాది ఓ 10 వేల ఆదాయం సంపాదిస్తే వచ్చే ఏడాది 11 వేలు సంపాదించాలి. అలా కాకుండా 10 వేల ఆదాయం వస్తే ఆదాయం తగ్గినట్లే. ఎందుకంటే గతేడాది రూపాయి విలువకు ఈ ఏడాది రూపాయి విలువకు చాలా తేడా వచ్చేస్తుంది. అలా కాదు ఎనిమిది వేలు మాత్రమే సంపాదిస్తే ఆర్థిక పరిస్థితి చితికిపోయినట్లే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఇదే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీ ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది.

అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో ఏపీ సర్కారు ఆదాయం 98,790 కోట్లు. గతేడాది ఇదే ఎనిమిది నెలల కాలానికి వచ్చిన ఆదాయం లక్షా ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అంటే పది వేల కోట్లు తక్కువ. ప్రజలు కట్టే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ప్రభుత్వానికి ఇంత ఆదాయం తగ్గిందంటే ప్రజల అంతకు 10 రెట్లు ఆదాయాన్ని కోల్పోయి ఉంటారు. ఆ లెక్కన ఏపీ ప్రజల మొత్తంగా లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని అంచనా వేయొచ్చు. రాష్ట్ర విభజనప్పుడు ఏపీ ప్రజల తలసరి ఆదాయం 93,000 లు, ఐదేళ్ల తరవాత 1 లక్ష 66 వేలు, ఇప్పుడు రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 1 లక్షా 20 వేల దగ్గర ఉంది. అంటే కొత్త ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఒక్కొక్కరికీ 40 వేలకు పైగానే ఆదాయం పడిపోయింది.

అంతేకాకుండా కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్తంభించి పోయింది. మొదట ఇసుక కొరత తర్వాత అమరావతి నిలిపివేతతో రియల్ ఎస్టేట్ రంగం దివాలా ముప్పును ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఉత్పాదక వ్యయం చేయడం మానేసింది. అంటే ప్రాజెక్టులు అభివృద్ధి పనులపై ఖర్చు లేదు. అనుత్పాదక వ్యయంగా భావించే సంక్షేమ పథకాలపై మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం తగ్గిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం వెతుక్కున్న ఒకే ఒక్క మార్గం అప్పులు. అప్పులు చేయడంలో ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర సృష్టిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరం అది కూడా పది నెలల కాలంలోనే ఏకంగా 47,100 కోట్ల అప్పు చేసింది. మరో రెండు నెలల కాలంలో మరో పది వేల కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తుంది.