మళ్ళీ నేపాల్లో భూకంపం, ఈసారి ఆంద్రప్రదేశ్ లో కూడా!

 

మళ్ళీ ఈ రోజు నేపాల్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతగా నమోదయిన ఈ భూకంపం యొక్క కేంద్రం నేపాల్ దేశంలోనే ఢోలాక-సింధుపల్చోక్ ప్రాంతాల మధ్యన ఉన్నట్లు గుర్తించారు. భూమికి 19 కిలోమీటర్ల లోపల నుండి ఈ ప్రకంపనలు మొదలయినట్లు భూగర్భశాఖ నిపుణులు తెలిపారు.

 

వరుస భూకంపాలతో ఇప్పటికే బెంబేలెత్తిపోయున్న నేపాల్ ప్రజలు భూకంపం మొదలవగానే వెంటనే అప్రమత్తమయ్యి తమ ఇళ్ళు, కార్యాలయాలు వదిలి పెట్టి భయంతో రోడ్లమీదకు పరుగులు తీసారు. అయితే ఈసారి భూకంపం వలన ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగలేదని సమాచారం. సుమారు 55 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఈ భూకంప ప్రభావం బంగ్లాదేశ్, పాక్లిస్తాన్, చైనా దేశాలలో కనిపించింది. ఉత్తరాది రాష్ట్రాలలో , ముఖ్యంగా దేశ రాజధాని డిల్లీలో కూడా ఈ భూకంప ప్రభావం బాగా కనబడింది. డిల్లీలో కొన్ని ప్రాంతాలలో మెట్రో రైళ్ళను కొద్దిసేపు నిలిపివేశారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలుచోట్ల భూకంప ప్రభావం కనబడింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 5.4 గా నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, కాళ్లకూరు, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పరిసరాల్లోని కొన్ని ప్రాంతాలలో స్వల్పంగా భూమి కంపించింది. విజయవాడలోని బెంజి సర్కిల్ కృష్ణలంక, భవానీపురం వాటి సమీప ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. విశాఖపట్నంలో మధురవాడ, మద్దిలపాలెం, మాధవధార, మురళీనగర్, విశాలాక్షి నగర్ తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.