మాపై కోపంతో పోలవరం ఆపొద్దు!!

 

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కర్నూలులో మూడు రోజులు జలదీక్ష చేసిన వైఎస్ జగన్‌ అప్పుడు ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోవాలని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేసారు. తాజాగా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ నిన్న కాళేశ్వరం వెళ్లాలి కాబట్టి మొన్న పోలవరం వెళ్లినట్టు ఉందన్నారు. పోలవరంలో కంటే కాళేశ్వరంలోనే ఎక్కువ సమయం గడిపారని విమర్శించారు. కాళేశ్వరం నిర్మిస్తే ఆంధ్రా-తెలంగాణ.. భారత్‌-పాకిస్తాన్‌లా మారతాయని జలదీక్షలో జగన్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 

పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. తమపై కోపంతో పోలవరం పనులు ఆపటం సరికాదని హితవు పలికారు. రూ.16వేల కోట్ల ప్రాజెక్టుని రూ.56వేల కోట్లకు తాము పెంచామన్న జగన్‌.. పోలవరం అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించగలదా అని ప్రశ్నించారు. పీపీఏ ఆమోదించిన అంచనాలు ఎంత తగ్గిస్తారు.. ఎలా తగ్గిస్తారో తగ్గించి చూపాలని సవాల్‌ చేశారు. పోలవరం అంచనాలు తగ్గిస్తే తామూ స్వాగతిస్తామన్నారు.