శివసేన మహా గెలుపు.. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా

 

మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం లోపు బలం నిరూపించుకోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో మహా రాజకీయం మరింత వేడెక్కింది. మొదట డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేసారు. అజిత్ పవార్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా బాట పట్టారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిసి రాజీనామా లేఖ సమర్పించనున్నట్టు ఆయన ప్రకటించారు. 

సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈరోజు ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి మెజారిటీ ఇచ్చారని, అయితే శివసేన బీజేపీని మోసం చేసిందని ఫడ్నవీస్ ఆరోపించారు. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు కలిగిన కాంగ్రెస్ - ఎన్సీపీ - శివసేన కలసి.. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసారు. బీజేపీని అధికారానికి దూరం చేయడమే ఆ మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ అని దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. ఏదిఏమైనా ఎన్నో అనూహ్య మలుపుల మధ్య ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం.. మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది.