డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్ళీ సన్నాహాలు మొదలు

 

డిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా ఎన్నాళ్ళు పడుతుందని సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం ప్రకటించడంతో డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మూడు ప్రధాన పార్టీలయినా బీజేపీ, కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీ నేతలతో నేడు, రేపు సమావేశం కాబోతున్నారు. మూడు పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంత సంఖ్యాబలం లేకపోవడం, ఏ ఒక్కరూ వేరొకరికి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సందిగ్ధంగానే ఉంది. అయితే బీజేపీ అగ్ర నేతలు కొందరు ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నప్పటికీ, పూర్తి మెజార్టీ లేకుండా ఇతర పార్టీలపై ఆధారపడి తుమ్మితే ఊడిపోయే ముక్కువంటి మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే, ప్రస్తుతం ప్రజలు కూడా ప్రధాని మోడీకి అనుకూలంగా ఉన్నందున, డిల్లీ శాసనసభకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించి పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే అన్నివిధాల మేలని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మరి కొందరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈరోజు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో బీజేపీ నేతలు సమావేశమయిన తరువాత దీనిపై స్పష్టత రావచ్చును.