అధికారమే పరమావధిగా రాజకీయాలు
posted on May 25, 2015 12:52PM
డిల్లీ, బీహార్, తమిళనాడులలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. డిల్లీలో అఖండ మెజార్టీతో గెలిచిన ఆమాద్మీ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేయవలసివస్తోంది. ప్రధాన కార్యదర్శి తాత్కాలిక నియామకంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు మొదలయిన యుద్ధం, ఎన్డీయే ప్రభుత్వం గవర్నర్ కే పూర్తి అధికారాలున్నాయని నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఇప్పుడది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి, ఎన్డీయే ప్రభుత్వానికి మధ్య యుద్ధంగా మారింది. దీనిపై చర్చించేందుకు 26, 27 తేదీలలో అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి రాష్ట్రపతికి పంపాలని ఆమాద్మీ ప్రభుత్వం భావిస్తోంది.
“ఇది రాజకీయ సమస్య ఎంత మాత్రం కాదని, రాజ్యాంగ సమస్య గనుకనే తాము కలుగజేసుకొని వివరణ ఇచ్చేమని, తద్వారా ఇకపై డిల్లీ ప్రభుత్వం సజావుగా పరిపాలన చేసుకోవచ్చని” ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కానీ అది తన ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేయడమేనని కేజ్రీవాల్ వాదన. ప్రస్తుతం తనకు జవాబుదారిగా ఉన్న అవినీతి నిరోధక శాఖను త్వరలోనే గవర్నర్ తన చేతుల్లోకి తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తలపై కేజ్రీవాల్ స్పందిస్తూ “అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న మా ప్రభుత్వాన్ని గవర్నర్ ద్వారా నియంత్రించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని” ఆరోపించారు.
ప్రభుత్వంలో వివిధ వ్యవస్థలను నడిపించే ఉన్నతాధికారులపై గవర్నర్ కి అధికారాలుంటాయా? లేక ప్రజలెన్నుకొన్న ప్రభుత్వానికా? అనేది రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సిన విషయం. కానీ దాని కోసం అఖండ మెజార్టీతో ప్రజలెన్నుకొన్న మోడీ ప్రభుత్వం, ఆమాద్మీ ప్రభుత్వం పోరాడుకోవడం చాలా బాధాకరం.
ఇక ఈ ఏడాది చివరిలో జరుగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆరు జనతా పార్టీలు విలీనం అయ్యేయి. కానీ అధికారం కోసం తహతహలాడిపోతున్న లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ కారణంగా ఇంతవరకు విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. పైగా వారిప్పుడు మెల్లగా విమర్శలు గుప్పించుకోవడం మొదలుపెట్టారు కూడా.
ప్రధానమంత్రి అయ్యేందుకు తనకు అర్హత లేదని పైకి చెప్పుకొనే నితీష్ కుమార్, అందుకోసం ఇదివరకు కూడా ఇటువంటి ప్రయోగాలకు సిద్దపడ్డారు. కానీ అవేవీ ఫలించకపోవడంతో ఇదివరకు తను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన జితన్ రామ్ మంజీని బలవంతంగా దింపేసి తను ఆ కుర్చీ ఎక్కారు. తమ జె.డి.యు. పార్టీని జనతా పరివార్ లో విలీనం చేయడానికి అంగీకరించినప్పటికీ తననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబట్టడంతో, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తహతహలాడిపోతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తన ఆర్.జే.డి.ని ఆ పేరులేని కొత్త పార్టీలో విలీనం చేయకుండా బిగుసుకు కూర్చొన్నారు. వారిద్దరూ చేస్తున్న రాజకీయాలతో కొత్త పార్టీని పుట్టక ముందే చంపేశారు.
ఇక అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా ప్రకటించినప్పటి నుండి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పన్నీర్ సెల్వం, తన చేతిలో పూర్తి అధికారాలున్నప్పటికీ కేవలం సాధారణ పరిపాలనకే పరిమితమయ్యారు తప్ప ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. ఒకవేళ ఏదయినా కీలక నిర్ణయం తీసుకొన్నట్లయితే అది అమ్మ (జయలలిత) అధికారాలను ప్రశ్నించడం, ఆమెను ధిక్కరించడం, ఆమె పట్ల అవిధేయత ప్రదర్శించినట్లేననే భావన అధికార అన్నాడీయంకే పార్టీలో బలంగా నెలకొని ఉంది. అందుకే ప్రతిపక్ష పార్టీలు ఎంతగా విమర్శిస్తున్నా పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహా మంత్రులు అందరూ కూడా జయలలిత నామ స్మరణంలోనే గత 8 నెలలూ గడిపేశారు. వారందరికీ అందుకు తగ్గ ప్రతిఫలం దక్కింది కూడా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన జయలలిత వారందరినీ తన మంత్రివర్గంలోకి మళ్ళీ తీసుకొన్నారు. ఇంతకాలంగా జయలలిత కోసం ఆయన పక్కన పెట్టి ఉంచిన అన్ని ఫైళ్ళ మీద ఆమె చకచకా సంతకాలు చేసేసారు.
మంత్రిగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎదగడం సర్వసాధారణమయిన విషయమే. కానీ ఇంతకాలం ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడు ఆర్దికమంత్రిగా చేయవలసిరావడం...అందుకు ఆయన ఏ మాత్రం సిగ్గుపడకపోవడం రెండూ కూడా విచిత్రమే. ఈ మూడు చోట్ల జరుగుతున్న రాజకీయ పరిణామాలు పైకి వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ వాటి అంతిమ గమ్యం మాత్రం అధికారం కోసం జరుగుతున్న ఆరాటం...పోరాటాలేనని చెప్పవచ్చును.