దాసరి ఆస్తులు జప్తు
posted on Mar 31, 2015 11:00AM
దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) జప్తు చేసింది. దాసరి నారాయణరావుకి చెందిన సౌభాగ్య మీడియా లిమిటెడ్‌కి చెందిన 2.25 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రిగా వున్న సమయంలో దాసరి నారాయణరావు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వున్న విషయం తెలిసిందే. అమర్‌కొండా ముర్గాదంగల్ బొగ్గు గనిని కేటాయించినందుకు ప్రతిఫలంగా జిందాల్ గ్రూప్‌కి చెందిన జెఎస్‌డబ్ల్యు నుంచి సౌభాగ్య మీడియాకు నిధులు ముట్టినట్టుగా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై ఇడి అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాసరిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు గతంలోనే దాసరిని ప్రశ్నించారు. తాజాగా అధికారులు జప్తు చేసిన ఆస్తుల్లో 50 లక్షల రూపాయల నగదు, రెండు లగ్జరీ వాహనాలు, ఇల్లు ఉన్నట్టు తెలిసింది. అయితే సౌభాగ్య మీడియాలో తాను 2008-2011 మధ్య కాలంలో మాత్రమే డైరెక్టర్‌గా ఉన్నట్టు దాసరి చెబుతున్నారు. సిబిఐ, ఇడి ఆరోపిస్తున్న డబ్బుల లావాదేవీలు ఆ తర్వాత కాలంలో జరిగాయనేది దాసరి వాదన.