ప్రగతి భవన్ ను తాకిన కరోనా.. తెలంగాణాలో కరోనా విలయం 

తెలంగాణలో కరోనా తీవ్రత రోజు రోజుకు తీవ్రమవుతోంది. గురువారం కూడా భారీగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,213 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఎక్కువ భాగం 998 కేసులు ఒక్క హైదరాబాద్ పరిధిలో నే నమోదయ్యాయి. ఇక మేడ్చల్‌లో 54, రంగారెడ్డిలో 48, ఖమ్మంలో 18, వరంగల్ రూరల్‌లో 10, వరంగల్ అర్బన్‌లో 9, నల్గొండలో 8, భద్రాద్రిలో 7, సిరిసిల్లలో 6, కరీంనగర్‌లో 5, నిజామాబాద్‌లో 5, ములుగు, నిర్మల్‌ ల లో 4 చొప్పున, నారాయణపేట, కామారెడ్డిలో 2 చొప్పున, గద్వాల్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వికారాబాద్ ల ‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

ఇది ఇలా ఉండగా నిన్న సీఎం కార్యకలాపాలు సాగించే సీఎం క్యాంప్ ఆఫీసు, ప్రగతి భవన్ లో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడి గెలిచిన 9,069 మంది డిశ్చార్జి అయ్యారు. 275 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇక టెస్టుల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 5,356 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,143 మందికి నెగెటివ్ రాగా 1,213 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 98,153 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.