ఏపీ లో నిన్న రాత్రి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకూ జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

"రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసులు నెగటివ్ గా నిర్దారించబడ్డాయి" అని అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

కాగా, ప్రస్తుతం ఏపీలో 348 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 9 మంది చికిత్స అనంతరం కరోనా నెగటివ్ నిర్దారణ అయి, డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం  474 క్వారంటైన్  సెంటర్లను నిర్వహిస్తోంది. కరోనా విపత్తును ఎదుర్కోవటానికి ఈ సెంటర్లలో 46,872 పడకలను సిద్ధం చేశారు. రమారమి 24,537 అనుమానితులను స్వీయ గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రస్తుతం 5,635 మంది  ఈ సెంటర్లలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.